Begin typing your search above and press return to search.

నటుడు వివేక్ మరణానికి అసలు కారణం తెలిసింది

By:  Tupaki Desk   |   22 Oct 2021 1:37 PM GMT
నటుడు వివేక్ మరణానికి అసలు కారణం తెలిసింది
X
ప్రముఖ తమిళ సినీ నటుడు వివేక్ ఈ ఏడాది ఏప్రిల్ 17న హఠాన్మరణం చెందారు. కమెడియన్ గా, సహృదయుడిగా మంచి పేరు తెచ్చుకున్న వివేక్ మరణం కలకలం రేపింది. ఆయన చనిపోవడానికి ఒక రోజు ముందు కరోనా టీకాలు వేసుకున్నాడు. ఆ టీకాలు వికటించే ఆయన మరణించాడని వార్తలు వచ్చాయి. నటుడి మరణానికి టీకా వల్ల కలిగే దుష్ప్రభావమే కారణమని సోషల్ మీడియాలో చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివేక్ మరణానికి వ్యాక్సిన్ వేయించుకోవడం కారణం కాదని ఆరోగ్యశాఖ వివరణ కూడా ఇచ్చింది.

కరోనావైరస్ రాకుండా లేదా దాన్నుంచి మన రోగనిరోధక శక్తి పెంపొందడానికి కోవిడ్ టీకాలు వేసుకోవడం తప్ప మరో మార్గం లేదు. అయితే దాని వల్ల సైడ్ ఎఫెక్ట్ లు కలుగుతున్నాయని కొన్ని సంఘటనలు గందరగోళాన్ని.. అనిశ్చితిని సృష్టిస్తున్నాయి.

మరో తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ అయితే గుండెజబ్బులు గల వివేక్‌కు ఎందుకు టీకాలు వేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఆయన గుండెపోటుకు కరోనా వ్యాక్సిన్ కారణమని ఆయన ఆరోపించారు.

వివేక్ మరణంపై నిగ్గు తేల్చేందుకు విల్లుపురంకు చెందిన సామాజిక కార్యకర్త ఎన్.ఎస్ శరవణన్ పూనుకున్నారు. వివేక్ హఠాన్మరణానికి అసలైన కారణం తెలియజేయాలంటూ ఎన్.హెచ్.ఆర్.సిలో ఫిర్యాదు చేశారు. దాంతో ఎన్.హెచ్.ఆర్.సి ఈ ఫిర్యాదును కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖకు పంపింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వేక్సిన్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ శాఖ ఆ ఫిర్యాదును పరిశీలించి తాజాగా వివేక్ మరణానికి కారణాలను తెలియజేస్తూ ఓ నివేదిక ను విడుదల చేసింది.

'అధిక రక్తపోటు, కార్డియాక్ అరెస్ట్ కారణంగానే వివేక్ మరణించాడని.. ఆయన చనిపోవడానికి వ్యాక్సిన్ కు ఎలాంటి సంబంధం లేదని' నివేదికలో పేర్కొంది. దీంతో వివేక్ మరణంపై ఊహాగానాలకు చెక్ పడింది.

ఈ క్రమంలోనే ప్రజలలో భయాందోళనలను తొలగించడానికి తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ మీడియాకు వివరించారు. "వివేక్ కు కరోనా లేదు. అతను ఇంతకు ముందు కరోనా పరీక్ష చేసుకోగా నెగెటివ్ వచ్చింది. అతడికి హృద్రోగ సమస్యలున్నాయి. గుండెనాళాల్లో బ్లాక్స్ కలిగి ఉన్నాడు. ఇప్పుడు దాని కోసం చికిత్స పొందాడు. గుండె నాళాల్లో బ్లాక్ ఒక రోజులో జరగదు. గురువారం 860 మంది వ్యక్తులు అదే ఆసుపత్రిలో వివేక్ వలే కోవాక్సిన్ టీకాలు తీసుకున్నారు. టీకా తరువాత అనాఫిలాక్టిక్ ప్రతిచర్య 15 నుండి 30 నిమిషాల్లో ప్రారంభం అవుతుంది. దీని కోసం మేము ఎల్లప్పుడూ రోగుల కోసం వైద్య సదుపాయం సిద్దంగా ఉంచుతామని". తెలిపారు. వివేక్ మరణం కరోనా టీకా వికటించడం వల్ల కాదని.. ఆయనకున్న గుండె జబ్బులే నని తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి స్పష్టం చేశారు.

ప్రజలలో అవగాహన కలిగించడానికి నటుడు వివేక్ ఏప్రిల్ 15న మీడియా సమక్షంలో కరోనా వ్యాక్సిన్ షాట్ తీసుకున్నారు. ప్రజలంతా కోవిషీడ్ లేదా కోవాక్సిన్ టీకా తీసుకోవాలని ఆయన సూచించారు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వైరస్ నుండి రక్షణ పొందే విషయంలో ఇతర జబ్బులున్నా.. మందులు వాడుతున్నా టీకా వేసుకోవచ్చని ఆయన అన్నారు.

మరుసటి రోజు వివేక్ గుండెపోటుతో ఆస్పత్రి పాలయ్యాడు. అపస్మారక స్థితిలో ఆసుపత్రికి చేరి చికిత్స పొందుతూ ఏప్రిల్ 17 ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు.