Begin typing your search above and press return to search.

థియేట‌ర్ల‌లో మ‌ళ్లీ సంద‌డి మొద‌లైంది

By:  Tupaki Desk   |   12 Feb 2022 4:30 PM GMT
థియేట‌ర్ల‌లో మ‌ళ్లీ సంద‌డి మొద‌లైంది
X
ఎట్ట‌కేల‌కు మ‌ళ్లీ థియేట‌ర్ల‌లో సంద‌డి మొద‌లైంది. కోవిడ్ థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా థియేట‌ర్ల‌కు జ‌నాలు వ‌స్తారా అని స్టార్ హీరోల‌తో పాటు స్టార్ ప్రొడ్యూస‌ర్ లు ఒక ద‌శ‌లో భ‌య‌ప‌డ్డారు. త‌మ చిత్రాల‌ని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాలా లేక ఓటీటీకి ఇచ్చేయాలా అని త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న వేళ గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో నంద‌మూరి బాలకృష్ణ న‌టించిన `అఖండ‌` ఆ భ‌యాల్ని పోగొడితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `పుష్ఫ‌` భారీ చిత్రాల‌కు మ‌రింత ఊపుని తీసుకొచ్చింది.

డిసెంబ‌ర్ లో విడుద‌లైన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డ‌మే కాకుండా థియేట‌ర్ల‌లో భారీ చిత్రాల రిలీజ్ ల కోసం ఎదురుచూస్తున్న నిర్మాత‌ల‌కు కొండంత ధైర్యాన్నిచ్చాయి. అయితే జ‌న‌వ‌రిలో పెద్ద చిత్రాల సంద‌డి లేక‌పోయే స‌రికి హ‌డావిడీ ఏమీ క‌నిపించ‌లేదు. మ‌ళ్లీ `బంగార్రాజు`తో కాస్త హ‌డావిడీ క‌నిపించింది. ఫిబ్ర‌వ‌రిలో ఖిలాడీ, డీజే టిల్లు చిత్రాలు మ‌రింత ఊపుని తీసుకొచ్చాయి. నైజాంలో టికెట్ రేట్లు పాత ప‌ద్ద‌తుల్లోనే వున్నా.. ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా రేట్లు పెంచుకునే వెసులుబాటు లేక‌పోయినా థియేట‌ర్ల‌న్నీ వ‌రుస సినిమాల కార‌ణంగా సంద‌డి సంద‌డిగా క‌నిపించాయి.

ఏపీలో ప్ర‌భుత్వం టికెట్ రేట్లు త‌గ్గించ‌డం, 50 వాతం ఆక్యుపెన్సీని విధించ‌డం వంటి కార‌ణాలు క‌నిపించినా థియేట‌ర్ల‌లో జ‌నం సంద‌డి చేయ‌డం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా థ‌ర్డ్ వేవ్ కోర‌లు చాస్తున్నా జ‌నం మాత్రం దాన్ని ప‌క్క‌న పెట్టి థియేట‌ర్ల‌లో సంద‌డి చేశారు. తాజాగా విడుద‌లైన `డీజే టిల్లు` 50 శాతం ఆక్యుపెన్సీలో కాకినాడ లాంటి సెంట‌ర్ లోని మొత్తం 7 థియేట‌ర్లు ఫుల్ కావ‌డం గ‌మ‌నార్హం.

ఇదే త‌ర‌హాలో విశాఖ ప‌రిథిలోని నాలుగు థియేట‌ర్లు.. గుంటూరు లోని ఎనిమిది థియేట‌ర్లు పూర్తిగా ఫుల్స్ కావ‌డం 50 శాతం ఆక్యుపెన్సీనే కార‌ణంగా తెలుస్తోంది. ఈ విధానం ఈ త‌ర‌హా చిత్రాల‌కు బాగా క‌లిసి వ‌స్తోంద‌ని చెబుతున్నారు. ఇక ఈ శుక్ర‌వారం విడుద‌లైన `ఖిలాడీ` కి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ల‌భించాయి. పెద్ద సినిమా కావ‌డంతో హైర్ లు భారీగానే వ‌చ్చాయ‌ని చెబుతున్నారు. అయితే డివైడ్ టాక్ రావ‌డం ఈ మూవీ క‌లెక్ష‌న్ ల‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తోంది.

`డీజే టిల్లు` 12న రిలీజ్ కావ‌డం.. టాక్ పాజిటివ్ గా వుండ‌టంతో ఈ కార‌ణంగా రెండ‌వ రోజు క‌లెక్ష‌న్ లు కొంత వ‌ర‌కు త‌గ్గిన‌ట్టుగా చెబుతున్నారు. ఏది ఎలా వున్నా.. ఎలాంటి రిస్ట్రిక్ష‌న్స్ పెట్టినా థియేట‌ర్ల‌లో మొత్తానికి మ‌ళ్లీ మునుప‌టి సంద‌డి మొద‌లైంది. ఇది ఈ నెలాఖరుతో పాటు వ‌చ్చే నెల‌లో విడుద‌ల కానున్న చిత్రాల‌కు మ‌రింత ప్ల‌స్ గా మారే అవ‌కాశం వుంద‌ని, భారీ చిత్రాల రిలీజ్ లు వుండ‌టంతో థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల సంద‌డి మ‌రింత‌గా పెరగ‌డం ఖాయం అంటున్నారు.