Begin typing your search above and press return to search.

తెర వెనుక సత్తా చాటుతున్న హీరోలు..!

By:  Tupaki Desk   |   28 Nov 2022 5:35 AM GMT
తెర వెనుక సత్తా చాటుతున్న హీరోలు..!
X
ప్రస్తుతం అనేక మంది హీరోలు తెర మీద కనిపించడమే కాకుండా.. మెగా ఫోన్ పట్టుకొని తెర వెనుక కూడా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. సొంతంగా కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ రాసుకోవడమే కాదు.. మెగా ఫోన్ పట్టుకొని దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరికొందరు సినిమా నిర్మాణం కూడా చూసుకుంటున్నారు. ఓవరాల్ గా 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన కలిగి ఉండి.. మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్నారు.

ఇప్పుడు ఎక్కడ చూసినా డైరెక్టర్ కమ్ యాక్టర్స్ గా రిషబ్ శెట్టి మరియు ప్రదీప్ రంగనాథన్ ల పేర్లు మారుమ్రోగుతున్నాయి. రిషబ్ తన స్వీయ దర్శకత్వంలో 'కాంతార' వంటి చిత్రాన్ని తెరకెక్కించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో సినిమా తీసి, 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాడు. అలానే 'లవ్ టుడే' అనే తమిళ చిత్రంతో సంచలనం సృష్టించాడు ప్రదీప్. 5 కోట్లతో మూవీ రూపొందించి, 75 కోట్లకు పైగా కలెక్షన్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు.

పాండమిక తర్వాత ఎలాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాలో తెలియక అగ్ర దర్శకులే అయోమయ పరిస్థితుల్లో ఉంరే.. రిషబ్ శెట్టి - ప్రదీప్ లు సరికొత్త కథలను తెరపైన ఆవిష్కరించి బాక్సాఫీస్ ని షేక్ చేసారు. సరైన కంటెంట్ ఉంటే వందల కోట్ల బడ్జెట్.. భారీ తనం ఉట్టిపడే సెట్లు - కంప్యూటర్ గ్రాఫిక్స్ అవసరం లేదని నిరూపించారు. అద్భుతంగా నటించడమే కాదు.. తమ రచన - దర్శకత్వ ప్రతిభతో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమలోనూ అప్పటి నందమూరి తారక రామారావు - కృష్ణ ఘట్టమనేని దగ్గర నుంచి ఇప్పటి అడివి శేష్ - విశ్వక్ సేన్ వరకూ అనేకమంది హీరో కమ్ డైరెక్టర్ గా సత్తా చాటారు. దాసరి నారాయణ రావు - ఆర్ నారాయణమూర్తి - ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి పలువురు తాము డైరెక్ట్ చేసే సినిమాలలో లీడ్ రోల్స్ పోషించిన సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ తన 'ఆదిత్య 369' చిత్రానికి సీక్వెల్ గా 'ఆదిత్య 999 మ్యాక్స్' అనే చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

'ఫలక్ నుమా దాస్' సినిమాతో డైరెక్టర్ గా మారిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ఇప్పుడు తన స్వీయ దర్శకత్వంలో 'దాస్ కా ధమ్కీ' అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రానికి నిర్మాత కూడా విశ్వకే. 'కర్మ' 'కిస్' వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన వర్సటైల్ హీరో అడివి శేష్.. తన 'క్షణం' 'గూఢచారి' 'మేజర్' వంటి సినిమాలను స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ప్రస్తుతం 'గూఢచారి 2' కోసం కథ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడు.

సిద్ధు జొన్నలగడ్డ మరియు కిరణ్ అబ్బవరం లాంటి యువ హీరోలు తాము నటించే సినిమాలకు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుంటారు. 'గుంటూరు టాకీస్' 'కృష్ణ అండ్ హిజ్ లీల' 'మా వింత గాథ వినుమా' 'డీజే టిల్లు' సినిమాలకు రచయితగా చేసిన సిద్దు.. ప్రస్తుతం 'డీజే టిల్లు స్క్వేర్' మూవీ చేస్తున్నాడు. 'రాజావారు రాణిగారు' 'ఎస్ ఆర్ కళ్యాణ మండపం' 'నేను మీకు కావాల్సిన వాడిని' వంటి చిత్రాలకు కిరణ్ కథ - డైలాగ్స్ రాసుకున్నాడు.

ఇలా టాలీవుడ్ లో చాలామంది హీరోలు తాము నటించే సినిమాలకు స్క్రిప్ట్ - స్క్రీన్‌ ప్లే సమకూర్చడమే కాదు.. దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తూ మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్నారు. రెండు పడవల సవారీ చేస్తూనే, బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌ బస్టర్‌ విజయాలను అందుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.