Begin typing your search above and press return to search.

మ‌హాన‌టి సావిత్రిని అక్కా అని పిలిచిన న‌టి

By:  Tupaki Desk   |   27 Jan 2023 10:19 AM GMT
మ‌హాన‌టి సావిత్రిని అక్కా అని పిలిచిన న‌టి
X
సావిత్రికి స‌మ‌కాలికురాలు అయినా కానీ జ‌మున అంద‌చందాల‌కు ఆ రోజుల్లో వీరాభిమానులు కాని యువ‌త‌రం లేనే లేరు. ఆమె అందాలరూపాన్నే ఊహించుకొనే అభిమానులు ఎందరో. క్లాసిక్ చిత్రాల మేటి క‌థానాయిక‌గా ఆ స్ఫుర‌ద్రూపాన్ని మ‌ర్చిపోవ‌డం అంత తేలిక కాదు.

తనకంటే వయసులో చిన్నవారి సరసన సైతం హీరోయిన్ గా నటించి మెప్పించిన న‌టి. సత్యభామగా తెరపై ఆమె అభినయించిన తీరు అనితరసాధ్యం. ఆమె ఎంద‌రో న‌వ‌త‌రం హీరోల‌కు జీవితాన్నిచ్చార‌ని కూడా చెప్పాలి. త‌న‌కంటే చిన్న‌వ‌య‌సు హీరోల స‌ర‌స‌న న‌టించి వారికి జీవితాన్నిచ్చిన న‌టి చాలా అరుదు.

జమున అసలు పేరు జానా బాయి. కర్ణాటకలోని హంపిలో జన్మించినా, గుంటూరు జిల్లా దుగ్గిరాలలో పెరిగారు. అదే సమయంలో సావిత్రి సైతం నాటకాలు వేసేవారు. ఓ సారి అనుకోకుండా దుగ్గిరాలలో సావిత్రి ప్రదర్శన ఇచ్చే సమయంలో జమున వారి ఇంటిలోనే దిగారు. అలా చిత్రసీమకు ముందే సావిత్రిని 'అక్కా' అని పిలుస్తూ సాగారు. సావిత్రి స్ఫూర్తితో జమున సైతం నాటకాల్లో నటించడం మొదలెట్టారు. ఆ సమయంలో ప్రఖ్యాత నటులు జగ్గయ్య వీరిద్దరికీ నాటకాల్లో అవకాశాలు కల్పిస్తూ వాటికి దర్శకత్వం వహించేవారు.

తొలి చిత్రం పుట్టిల్లు త‌ర్వాత జమున నటించిన దొంగరాముడు- మిస్సమ్మ- చిరంజీవులు- ముద్దుబిడ్డ- భాగ్యరేఖ- భూకైలాస్- ఇల్లరికం- గులేబకావళి కథ- గుండమ్మకథ- బొబ్బిలియుద్ధం- మంచి మనిషి- మూగమనసులు.. రాముడు-భీముడు- మంగమ్మ శపథం- దొరికితే దొంగలు- తోడు-నీడ- పూలరంగడు- రాము- మట్టిలో మాణిక్యం- పండంటి కాపురం- తాసిల్లార్ గారి అమ్మాయి- సంసారం- మనుషులంతా ఒక్కటే- ఉండమ్మా బొట్టు పెడతా.. ఇవన్నీ జ‌మున కెరీర్ లో క్లాసిక్స్.

యన్టీఆర్- ఏయన్నార్ ల‌కు స‌రిజోడు అనిపించుకున్న మేటి క‌థానాయిక జ‌మున‌. ఉండమ్మా బొట్టు పెడతా చిత్రంలో కృష్ణ సరసన నటించారు. ఆ సినిమాతో కృష్ణకు ఫ్యామిలీ ఆడియెన్స్ లోనూ మంచి గుర్తింపు లభించింది. ఇక స్టార్ డమ్ కోసం దాదాపు పుష్కరకాలంగా తపిస్తోన్న శోభన్ బాబుకు జమునతో నటించిన 'తాసిల్దార్ గారి అమ్మాయి' బిగ్ బ్రేక్ నిచ్చింది. అలాగే హరనాథ్ కు జమునతో నటించిన చిత్రాలే హీరోగా మంచి పేరు సంపాదించి పెట్టాయి. కృష్ణంరాజును రెబల్ స్టార్ గా నిలిపిన 'కటకటాల రుద్రయ్య'లో జమున కృష్ణంరాజుకు జోడీగాను.. అలాగే తల్లిగాను విల‌క్ష‌ణ పాత్ర‌ల్లో నటించారు. ఇలా అనేకమంది స్టార్ హీరోస్ కు విజయనాయికగా అలరించారు జమున.

జ‌మున త‌న జీవిత చ‌ర‌మాంకంలో తన కూతురు- మనవడుతో కలసి ప్రస్తుతం హైదరాబాద్ లోనే నివసిస్తున్నారు. జ‌మున మ‌ర‌ణ వార్త విని సినీలోకం త‌ల్ల‌డిల్లింది. త‌న స‌మ‌కాలిక న‌టీన‌టులు జ‌మున కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నారు. మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఇప్ప‌టికే దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.