హాట్ టాపిక్: కోలీవుడ్ లో కత్తిలాంటి హీరో!

Tue Jun 18 2019 15:48:30 GMT+0530 (IST)

ఏ పని చేయాలన్నా అర్హత కావాలని అంటూ ఉంటారు. కానీ కొన్నిటికి మాత్రం డబ్బు ఉంటే చాలు ఎంచక్కా అర్హత వచ్చేస్తుంది. అలానే హీరో కావాలంటే ముఖ్యమైన అర్హత నటన.. అందంగా కనిపించడం అనుకుంటే మీరు సత్తెకాలపు సత్తెయ్యలే.  బ్యాంకులో ఫుల్లుగా క్యాష్ ఉంటే మీరు కూడా హీరో అయిపోవచ్చు.  కాకపోతే చేతి చమురు కాస్త వదులుతుంది అంతే.  చెన్నై గురించి తెలిసిన వారందరికీ చక్కగా తెలిసిన పేరు శరవణా స్టోర్స్.  ఈ శరవణా స్టోర్స్ కు అధినేత లెజెండ్ శరవణన్.  ఈయన త్వరలో హీరోగా కోలీవుడ్ ను షేక్ చేయబోతున్నాడట.ఈయనకు తెరపై కనిపించాలని మహా ఉబలాటం. అందుకే శరవణా స్టోర్స్ అడ్వర్టైజ్ మెంట్స్ లో వేరే మగ పురుగులకు అవకాశం ఇవ్వడు. ఈయనే నటిస్తాడు. తమన్నా.. హన్సిక  అందమైన హీరోయిన్లతో కలిసి శరవణా స్టోర్స్ యాడ్స్ లో  నటించి తమిళ ప్రేక్షకులకు ఆ.. నందాన్ని కలిగిస్తాడు.  మరి లలితా జ్యూవెలర్స్ లో గుండూ బాస్ కూడా సొంతగా ప్రమోషన్ చేసుకుంటాడు కదా అని మీరు ఒక వెర్రిమొర్రి ప్రశ్న వేసే అవకాశం ఉంది.  అయితే లలితా జ్యూవెలర్స్ గుండూ బాస్ రాగం - తాళం వేరు..  ఈ లెజెండ్ శరవణన్ రాగం - తాళం వేరు. కింద యాడ్ చూసిన తర్వాత మీరే ఒప్పుకుంటారు లెండి.

ఈ లెజెండ్ శరవణన్ నటించే సినిమా త్వరలో ప్రారంభం కానుంది.  ఈ చిత్రానికి జేడీ - జెర్రీ అనే దర్శకుల ద్వయం దర్శకత్వం వహిస్తున్నారట. జేడి అంటే జోసెఫ్ డీ. సామి.  జెర్రీ అంటే జెరాల్డ్ .    వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న తమిళ ఉగాది సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తారట.  ఈ సినిమాలో నటించే హీరోయిన్..ఇతర నటీనటులు.. టెక్నిషియన్ల వివరాలను త్వరలో వెల్లడిస్తారని సమాచారం.