ప్రొడ్యూసర్స్ బయటపడాలంటే అదొక్కటే మార్గం...!

Sat Oct 17 2020 23:00:34 GMT+0530 (IST)

Thats the only way for producers to get out

కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ ఎంతటి అవస్థలు పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్స్ మల్టీప్లెక్సెస్ మూతబడిపోవడంతో విడుదలకు సిద్ధంగా సినిమాలన్నీ వాయిదా పడుతూ వస్తున్నాయి. సినిమా బయటకు రాకపోవడంతో ప్రొడ్యూసర్స్ భారీ నష్టాలను చవిచుస్తునారు. ఇప్పటికే సెట్స్ మీద ఉన్న సినిమాలకు.. అగ్రిమెంట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ కి సంబంధించిన నటీనటులకు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చి ఉండటంతో పెట్టుబడి ఎక్కడికక్కడ నిర్బంధం అయిపోయింది. కొందరు నష్టాల నుంచి బయటపడటానికి ఓటీటీల బాట పడుతున్నారు. ఇప్పుడిప్పుడే తిరిగి షూటింగ్స్ ప్రారంభమవుతున్నాయి. అయినప్పటికీ కరోనా నేపథ్యంలో షూటింగ్స్ అంటే ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్రైసిస్ నుంచి ప్రొడ్యూసర్స్ బయటపడానికి చాలా సమయమే పట్టేలా ఉంది.అయితే కరోనా క్రైసిస్ కష్టాల నుంచి నిర్మాతలను గట్టెక్కించడానికి నటీనటులు సాంకేతిక నిపుణుల పారితోషికాలలో కోతలు విధిస్తున్నట్లు యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పారితోషకాల్లో 20 శాతం కోతలు విధిస్తున్నామని ప్రకటించింది. దీని వల్ల ప్రొడ్యూసర్స్ కి అంతో ఇంతో మేలు జరుగుతుందేమో కానీ పూర్తిగా క్రైసిస్ నుంచి బయటపడలేడు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్లు సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకుంటే ప్రొడ్యూసర్స్ నష్టాల బారి నుంచి బయటపడే అవకాశం ఉంది. కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకోకుండా.. సినిమా లాభాల్లో వాటా తీసుకుంటే నిర్మాతలకు మేలు జరుగుతుంది. లాభమొచ్చినా నష్టమొచ్చినా అందరూ షేర్ చేసుకున్నట్లు అవుతుంది.

టాలీవుడ్ లో ఇప్పటికే కొందరు స్టార్ హీరోలు అగ్ర దర్శకులు ఇదే పద్ధతిలో సినిమాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో మిగతా వారు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ ప్రొడ్యూసర్స్ ఎప్పటి నుంచో ఇదే కోరుకుంటున్నారని తెలుస్తోంది. ట్రెడిషనల్ ప్రొడ్యూసర్స్ సైతం హీరోలు దర్శకులని నిర్మాణంలో భాగస్వామ్యం చేయడంతో పాటు ఇద్దరు ముగ్గురు ఇతర ప్రొడ్యూసర్స్ తో కలిసి లాభమైనా నష్టమైనా షేర్ చేసుకుందామనే ఆలోచిస్తున్నారట. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన నిర్మాతలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీలో అందరికీ ఉంది కాబట్టి.. టాలీవుడ్ హీరోలు దర్శకులు ఆ దిశగా ఆలోచిస్తారేమో చూడాలి.