యశోదలో ఇక ఆ పదం కనిపించదు

Tue Nov 29 2022 16:19:50 GMT+0530 (India Standard Time)

That Word Will Not Appear in Yashoda Movie

సమంత యశోద పై నెలకొన్న వివాదానికి ఎట్టకేలకు శుభం కార్డు పడింది.  ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఈవా ఆసుపత్రి నిర్వాహకులతో ఈ చిత్ర నిర్మాత  శివలెంక కృష్ణ ప్రసాద్ సంప్రదింపులు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించారు.  ఇకపై ఈ సినిమాలో ఈవా అనే పేరు కనిపించదు అని చెప్పారు.  సరోగసీ ప్రధాన కథావస్తువుగా తీసుకుని సమంత నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి కమర్షియల్ సక్సెస్ సాధించింది.సినిమాలో సమంత తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.  అంతా సవ్యంగా ఉంది అనుకుంటున్న ఈ సినిమా అనూహ్యంగా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో తమ సంస్థ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని ఈవా హాస్పిటల్స్ ఎండీ మోహన్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. యశోద సినిమా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ హీరోయిన్ సమంత డైరెక్టర్స్ హరీశ్ నారాయణ్ హరిశంకర్‌లపైన రూ.5 కోట్లకు పరువు నష్టం దావా కూడా వేశారు.  దాంతో ఈ సినిమా చుట్టూ వివాదాలు అల్లుకున్నాయి.

యశోద సినిమాలో తమ సంస్థ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఈవా ఆసుపత్రి పేరును ఉపయోగించి చూపించారని  దానివల్ల తమ సంస్థ ఇమేజ్ దెబ్బతింటోదని ఈ సినిమాను ఓటీటీలో ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రదర్శించకుండా నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆ సంస్థ ఎండీ మోహన్‌రావు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పైన స్పందించిన సిటీ సివిల్ కోర్టు ఈ చిత్రం ఓటీటీలో ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశిస్తూ ఈవా ఆసుపత్రి పిటిషన్‌పై స్పందించాలని చిత్ర నిర్మాతకు దర్శకులకు నోటీసులు జారీ చేసింది. దీంతో యశోద సినిమా వివాదంలో చిక్కుకున్నట్లయింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాత రంగంలోకి దిగి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించే దిశగా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈవా సంస్థ అధినేతలతో మాట్లాడి వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సినిమాలో ఈవా సంస్థ పేరు కనపడకుండా చర్యలు తీసుకుంటామని  చెప్పారు. దాంతో వివాదానికి ముగింపు పడినట్లయింది.

దీనిపై యశోద సినిమా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమాలో కథ నేపథ్యం క్రమంలో ఈవా ఆసుపత్రిని పేరును ఉపయోగించామే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్నారు. మా సినిమాలో ఈవా అనే పేరును కాన్సెప్ట్ ప్రకారం పెట్టిందే తప్ప వేరొకరి మనోభావాలు దెబ్బతీయాలని కాదు. ఈవా హాస్పిటల్ వారిని కలిసి జరిగింది నేను చెప్పాను. ఇక భవిష్యత్తులో ఈవా అనే పదం యశోదా సినిమాలో కనిపించదు. మా నిర్ణయాన్ని ఈవా వారు కూడా అంగీకరించారు. ఈ సమస్య ఇంతటితో పరిష్కారమైంది అని వివరణ ఇచ్చారు.

దీనిపట్ల ఈవా హాస్పిటల్స్ యాజమాన్యం కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. ఈవా హాస్పిటల్స్ ఎండీ మోహన్‌రావు మాట్లాడుతూ యశోద సినిమాలో మా పేరు వాడటంతో మేం చాలా హర్ట్ అయ్యాం. నిర్మాత చాలా తొందరగా ఈ సమస్యను క్లియర్ చేశారు. దానివల్ల సమస్య పరిష్కారమైంది. డాక్టర్స్ అందరూ కూడా ప్రాణాలు కాపాడాలని కోరుకుంటారు. సినిమావాళ్లు కూడా మా ప్రొఫెషన్‌ను గౌరవించాలి. ఇప్పటికీ ఎవరికైనా ఏదైనా జరిగితే ఠాగూర్ సినిమాలాగా జరిగింది అంటారు. సినిమా చాలా బలమైన మాద్యమం అని అయన అన్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.