'తలైవి' కి ఎక్కడ దెబ్బ పడిందబ్బా..?

Wed Sep 15 2021 16:42:47 GMT+0530 (IST)

Thalaivi got negative talk from the first show

సినీ నటి దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ''తలైవి''. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కంగనా రనౌత్ టైటిల్ రోల్ ప్లే చేయగా.. అరవింద్ స్వామి ఎంజీఆర్ పాత్రలో నటించారు. వినాయక చవితి సంధర్భంగా తెలుగు తమిళం హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.'తలైవి' విడుదలకు వారం రోజుల ముందే ప్రివ్యూ వేయగా.. మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. సినిమా చూసిన వాళ్ళు అలా ఉంది.. ఇలా ఉంది అంటూ ట్విట్టర్ లో పోస్టులు కూడా పెట్టారు. అలానే సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత తెలుగు తమిళ భాషల్లో పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. బ్లాక్ బస్టర్ సినిమాలకు వచ్చే స్థాయిలో రేటింగ్స్ ఉన్నాయి. కానీ వసూళ్ళు మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

హిందీలో 'తలైవి' చిత్రానికి మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. దీనికి తగ్గట్టుగా వసూళ్ళు ఉన్నాయి. కానీ రివ్యూస్ బాగున్న సౌత్ లో కూడా జయలలిత బయోపిక్ ని చూడటానికి జనాలు ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. తెలుగులో అంటే సరే.. తమిళ్ లో కూడా కలెక్షన్స్ రాకపోవడం గమనార్హం. విడుదలైన మూడు భాషలు కలిపి ఇప్పటివరకు ఈ చిత్రానికి రూ.5 కోట్లు మాత్రమే వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

తమిళ ప్రజలు 'అమ్మ'గా పిలుచుకునే జయలలిత జీవితంలోని అన్ని కోణాలనూ ''తలైవి'' చిత్రంలో చూపించకపోవడం వల్ల ప్రేక్షకులు ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి కనబర్చలేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే నిర్మాతలు మాత్రం ఈ సినిమా విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నామని చెబుతున్నారు.

నాన్ థియేట్రికల్ రైట్స్ తో బడ్జెట్ మొత్తం రికవరీ అయిందని.. సినిమాకు పెట్టిన ఖర్చు కంటే ఎక్కువే వచ్చిందని నిర్మాతలు తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా హిట్ అయిందా లేదా అని బాక్సాఫీస్ లెక్కల్ని పట్టి చెప్పలేమని.. పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చాయా లేదా అనేది పరిగణలోకి తీసుకోవాలని చెబుతున్నారు. కానీ ఇక్కడ సినిమాని తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ - ఎగ్జిబిటర్స్ గురించి కూడా ఆలోచించాలి కదా!