'భీమ్లా నాయక్ ' కు టెమ్టింగ్ ఆఫర్

Thu Dec 09 2021 07:00:01 GMT+0530 (IST)

Tempting offer to Bheemlanayak,

కోవిడ్ కారణంగా జనం ఓటీటీలకు ఎగబడుతుండటంతో ప్రస్తుతం ఏ భాషలో విన్నా వారి హవానే కొనసాగుతోంది. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో తెలియని అయోమయ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఓటీటీ ప్లాట్ ఫామ్‌లకు మునుపెన్నడూ లేనంతగా క్రేజ్ పెరిగింది. థియేటర్‌కి రావాలంటే సవాలక్ష సేఫ్టీలు అవసరం.. పైగా ట్రావెలింగ్ ఖర్చు తో పాటు ఫుడ్ ఖర్చు కూడా అదనంగా వుండటంతో ఒక్క క్లిక్కుతో ఒక్కరు చూసే ఖర్చుతో ఇంటిల్లి పాదికీ ఇంట్లోనే నచ్చిన సినిమా చూపించేయోచ్చు. ఇదే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్‌లకు బాగా కలసి వస్తోంది.దీంతో భారీ చిత్రాలని కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తే బాగుంటుందని.. ఓటీటీ లకు మరింత ప్రచారం.. క్రేజ్ .. వీవర్షిప్ పెరుగుతుందని భావించిన దిగ్గజ ఓటీటీ కంపనీలు వందల కోట్లు కుమ్మరించి భారీ చిత్రాలని సైతం కొనడానికి వెనుకాడటం లేదు. తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ దిగ్గజం `భీమ్లా నాయక్` చిత్రానికి టెమ్టింగ్ ఆఫర్‌ని ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దగ్గుబాటి రాణా నిత్యామీనన్ ల తొలి కలయికలో వస్తున్న సినిమా కావడం... ఇప్పటికే మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` కు ఇది రీమేక్ కావడంతో సహజంగానే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఆ అంచనాల్ని దృష్టిలో పెట్టుకునే ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ `భీమ్లా నాయక్` కు 225 కోట్ల ఆఫర్ ని ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆఫర్ లో వున్న నిజమెంత అన్నది కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. నెటఫ్లిక్స్ సంస్థ మార్కెట్ లెక్కలు వేసుకోకుండా ఏ సినిమాని గుడ్డిగా కొనేయదు. అందులోనూ 225 కోట్లు పెట్టి మరీ కొనడానికి ముందుకు రాదు. అది తీసుకునే సినిమాకి వరల్డ్ వైడ్ గా మార్కెట్.. క్రేజ్ వుండాలి... పెట్టిన పెట్టుబడికి మించి అది రికవరీ చేస్తుందో లేదో అంచనాకు రావాలి. అప్పుడే ఏ ప్రాజెక్ట్ కయినా భారీ మొత్తం పెట్టి కొనడానికి నెట్ ఫ్లిక్స్ ముందుకొస్తుందన్నది ఓటీటీ అనలిస్ట్‌ల మాట. దీన్ని బట్టి `భీమ్లా నాయక్`కు నెట్ ఫ్లిక్స్ 225 కోట్లు ఆఫర్ చేయడం అన్నది ఫేక్ అని తేల్చేస్తున్నారు. కావాలనే ఈ న్యూస్‌ని సృష్టించారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.