తెలుగు ఆర్టిస్టుల్లో డివైడ్ ఫ్యాక్టర్ అవసరమంటారా?

Tue Oct 19 2021 12:03:16 GMT+0530 (IST)

Telangana Association elections with 400 artists

తెలంగాణ సినీ పరిశ్రమకు అండగా.. కార్మికుల సంక్షేమ సహకారం కోసం ఏర్పాటైన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గత 7 సంవత్సరాలుగా విజయవంతంగా ముందుకు సాగుతోంది. 8000 మంది సినీ కార్మికులతో 800 ప్రొడ్యూసర్స్ తో 400 మంది టీ -మా ఆర్టిస్టులతో అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తోంది. ఇప్పటివరకు టిఎఫ్ సిసి ద్వారా 140 సినిమాలు సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యాయి. నిర్మాతలకు అత్యంత సులువుగా ప్రాసెస్ జరిపే సంస్థగా టిఎఫ్ సిసి ప్రాచుర్యం పొందింది. లాక్ డౌన్ సమయంలో కార్డు ఉన్నా లేకపోయినా 20వేల సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా టిఎఫ్‌సిసి ద్వారా ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టిఎఫ్ సిసి సంస్థలో 15మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. వారితో పాటు పలువురి ఆర్టిస్టులకి నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ 5లక్షల రూపాయల హెల్త్ కార్డులను అందజేసారని సమాచారం. అలాగే ఆర్టిస్టులకి ఆర్టిస్టు కార్డులను ఉచితంగా అందజేయడం ఆయనకే చెల్లింది. గౌడ్ ఆధ్వర్యంలో ఎంతో మంది పేద కళాకారులకు చేయూతనిచ్చారు. సాయంలో ముందుటారాయన.152వ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ ఇంటర్నేషనల్ వారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా.లయన్ ప్రతాని రామకృష్ణగౌడ్ ని సేవా భూషన్ అవార్డుతో త్యాగరాయగాణసభలో ప్రముఖుల సమక్షంలో సత్కరించడం విశేషం. ఇటీవల జరిగిన `మా` ఎలక్షన్లలో రామకృష్ణ గౌడ్ స్వయంగా పాల్గొని నటీనటులందరితో కలిసిమెలిసి ఈ ఎన్నికలో తన వంతు సహకారాన్ని అందించారు. అలాగే ఎంతోమంది జానపద కళాకారులని..గాయనీ గాయకులను ప్రోత్సహించే దిశగా ఆయన కృషి ఎనలేనిదనే చెప్పాలి. ప్రస్తుత ఓటీటీ యుగంలో సినీ రంగంపై ఆసక్తి పెంచే దిశగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పెద్ద ఎత్తున సినిమా అవార్డుల ఫంక్షన్ ను టిఎఫ్ సిసి ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని తెలిపారు. ఇక ప్రస్తుతం 30 మందితో కూడిన టిఎఫ్‌సిసి పాలక కమిటీ గడువు ముగియనుండటంతో నవంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి. మరో రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ ఆఫీసర్ తెలియజేయనున్నారని ప్రతాని రామకృష్ణగౌడ్ (ఛైర్మన్ టిఎఫ్‌సిసి) ప్రకటించారు.

ఒక సెక్షన్ నుంచి విమర్శలు..!

ఆర్టిస్టులు అంటే ప్రాంతీయ విభేధం ఉండకూడదని అంటారు. ఇరుగు పొరుగు నుంచి వచ్చి టాలీవుడ్ లో పాగా వేసిన ఆర్టిస్టులు ఎందరో. కానీ ఏపీ - తెలంగాణ అంటూ స్థానిక ఆర్టిస్టులే వేరు కుంపటి పెట్టుకుని కలిసి బతకలేక.. కలుపుకోలేక సతమతమయ్యేవారి పరిస్థితిపై ఇటీవల తెలుగు నిర్మాతల్లో చర్చకు వచ్చింది. కానీ ఇప్పుడు ఎన్నికల పేరుతో డివైడ్ ఫ్యాక్టర్ ని తెరపైకి తేవడం ప్రధానంగా చర్చకు వస్తోంది. ముఖ్యంగా మెజారిటీ భాగం ఆంధ్రా నిర్మాతలే ఇక్కడ సినిమాలు తీస్తుంటే .. ఇప్పుడు తెలంగాణ ఆర్టిస్టులు పేరుతో డివైడ్ ఫ్యాక్టర్ ని తెరపైకి తెస్తున్న కొందరిపై చాలా సందేహాలున్నాయని చెబుతున్నారు. ఇంతకముందు మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ని రెండుగా చీల్చాలంటూ తెలంగాణ సీనియర్ నటుడు కం న్యాయవాది సీవీఎల్ ప్రయత్నించి చివరికి డ్రాపయ్యారు. కానీ ఈ తరహాలో విభజన ఆలోచనలు రాజకీయాలు ఇక్కడ ఎప్పటికీ వీడవని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏపీ అయినా తెలంగాణ అయినా ఆర్టిస్టుల్లో డివైడ్ అవసరమా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయినా ఇంతకుముందు అంతగా ప్రాధాన్యత లేని ఆర్టిస్టుల ఎన్నికలకు ఇప్పుడు మీడియా ఎందుకని అంత ప్రాధాన్యతనిస్తోందో అర్థం కావడం లేదని గుసగుసలాడేవాళ్లు ఉన్నారు. టీఆర్పీల కోసం ఇలాంటి వాటిని హైలైట్ చేస్తూ మీడియాలు ప్రజల విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాయనే అభిప్రాయం మెజారిటీ వర్గాల్లో ఉంది.