Begin typing your search above and press return to search.

తెలుగు సినిమాని బెదిరిస్తున్న తమిళ తంబీలు..!

By:  Tupaki Desk   |   1 Oct 2022 6:43 AM GMT
తెలుగు సినిమాని బెదిరిస్తున్న తమిళ తంబీలు..!
X
లెజండరీ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన "పొన్నియిన్ సెల్వన్" సినిమా మొదటి భాగం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకి తొలి రోజే మిశ్రమ స్పందన వచ్చింది.

తమిళ జనాలు 'PS 1' సినిమా అద్భుతమని పొగుడుతుంటే.. మిగతా భాషల్లో మాత్రం ఆశించిన టాక్ రావడం లేదు. తెలుగు ప్రేక్షకులైతే ఈ సినిమాతో పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యారు. ఏ దశలోనూ ఆకట్టుకోలేదని కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ క్రిటిక్స్ సైతం దీనికి తగ్గట్టుగానే రివ్యూలు రేటింగ్స్ ఇచ్చారు.

అయితే 'పొన్నియిన్ సెల్వన్' చిత్రానికి తెలుగులో వస్తున్న రెస్పాన్స్ ను చూసి తట్టుకోలేకపోతున్న తమిళ తంబీలు.. టాలీవుడ్ ఆడియన్స్ పై తెలుగు చిత్రాలపై తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఐటెమ్ సాంగ్స్ - అసాధ్యమైన విన్యాసాలు ఉంటేనే తెలుగు ప్రేక్షకులకు సినిమాలు నచ్చుతాయని.. అందుకే 'PS' లో ఉన్న గొప్పతనం గుర్తించటం లేదని దెప్పి పొడుస్తున్నారు.

ఈ క్రమంలో భారతీయ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన 'బాహుబలి' 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాలను కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. మేము తెలుగు సినిమాలను ఆదరిస్తుంటే.. మీరు మాత్రం నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. ఇప్పటి నుంచి తెలుగు సినిమాలను తమిళ్ లో ప్లాప్ చేస్తామని బెదిరిస్తున్నారు.

కోలీవుడ్ కు చెందిన సినీ క్రిటిక్ ఒకరు తెలుగులో 'పొన్నియిన్ సెల్వన్' కు వచ్చిన రివ్యూస్ తో హర్ట్ అయ్యాడు. "తమిళనాట తెలుగు సినిమాలు పెద్దగా విజయం సాధించడంలో మాకు ఎలాంటి సమస్యలు లేవు. కానీ మీరు ఒక తమిళ సినిమాను తగ్గించాలని ప్రయత్నిస్తే - మేము ఖచ్చితంగా తిరిగి అదే చేస్తాము" అని ట్వీట్ చేసాడు.

కానీ ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. ఆ తమిళ క్రిటిక్ పుట్టక ముందు నుంచే తెలుగు ప్రేక్షకులు తమిళ చిత్రాలను ఆదరిస్తున్నారు. 'ప్రేమసాగరం' - 'మరపురాని చిత్రం' దగ్గర నుంచి.. మొన్నటి 'విక్రమ్' వరకూ ఎన్నో తమిళ చిత్రాలు ఇక్కడ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. చిన్న చిత్రం పెద్ద సినిమా అని తేడా లేకుండా.. హీరో ఎవరు అని పట్టించుకోకుండా.. కంటెంట్ బాగున్న ప్రతీ మూవీని తెలుగులో హిట్ చేశారు.

తమిళ హీరోలకు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉందంటే అది తెలుగు ప్రేక్షకుల వల్లనే. ఇప్పుడు కోలీవుడ్ హీరోలు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేస్తున్నారంటే అందుకు కారణం కూడా అదే. ఈ విధంగా చూసుకుంటే మన హీరోలకే తమిళ్ లో పెద్దగా మార్కెట్ లేదు. బాహుబలి - RRR లాంటి ఒకటీ అర సినిమాలు మాత్రమే అక్కడ హిట్ అవుతుంటాయి.

మన జనాలు మాత్రం తమిళ్ సినిమాలు రిలీజ్ అయితే ఓ రేంజ్ లో హంగామా చేస్తుంటారు. తమిళ డబ్బింగ్ సినిమాల కోసం మన చిత్రాలను వాయిదా వేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. అంతెందుకు అక్కడ ప్లాప్ అయిన 'యుగానికి ఒక్కడు' లాంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు తమ నెత్తిన పెట్టుకున్నారు. అందుకే కోలీవుడ్ హీరో కార్తీ తెలుగు భాషనే తన మొదటి ప్రాధాన్యతగా పేర్కొంటుంటారు. కమల్ హాసన్ - రజినీ కాంత్ - సూర్య లాంటి ఎందరో తమిళ హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమపై, మన ప్రేక్షకులపై ప్రశంసల వర్షం కురిపించిన సందర్భాలు ఉన్నాయి.

మణిరత్నం తెరకెక్కించిన ఎన్నో తమిళ సినిమాలు తెలుగులో ఘన విజయం సాధించాయి. 'నాయకుడు' 'ఘర్షణ' 'రోజా' 'బాంబే' 'దళపతి' 'యువ' 'సఖి' 'ఓకే జాను' 'నవాబ్'.. ఇలా అనేక చిత్రాలు ఇక్కడ కూడా సత్తా చాటాయి. కాకపోతే ఇప్పుడు 'పొన్నియిన్ సెల్వన్' సినిమా తెలుగు ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వకపోవడంతో మిక్స్డ్ టాక్ వచ్చింది.

'పొన్నియిన్ సెల్వన్' అని కల్కి రాసిన తమిళ నవల ఆధారంగా PS సినిమా తెరకెక్కింది. ఇందులో చోళుల నేపథ్యం.. తమిళ సాంస్కృతిక ఆచార వ్యవహారాలు చూపించారు. పాత్రల పేర్లు కూడా తెలుగు వాళ్ళు పలికే విధంగా ఉండవు. దీనికి తోడు ప్రధాన పాత్రల్లో ఒక్క తెలుగు హీరో కూడా లేడు. సినిమా నచ్చితే తెలుగు జనాలు ఇలాంటివేమీ పట్టించుకోరని అనేక సందర్భాల్లో నిరూపితమైంది.

కాకపోతే 'పీఎస్ 1' ను మణిరత్నం ఎలాంటి హై ఇచ్చే సీక్వెన్స్ లు లేకుండా స్లో నేరేషన్ తో సహనానికి పరీక్ష పెట్టారు. గూస్ బమ్స్ ఇచ్చే ఎలివేషన్ సీన్స్ మరియు భావిద్వేగానికి గురి చేసే ఎమోషనల్ సన్నివేశాలు లేకపోవడం వంటి అంశాలు నిరాశ పరిచాయి. దీంతో ప్రత్యేకంగా మణిరత్నం సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు సైతం డిజప్పాయింట్ అయ్యారు. అంత మాత్రానికే తెలుగు సినిమాలను మరియు ప్రేక్షకులను బెదిరించడం కరెక్ట్ కాదు.

బ్లాక్ బస్టర్స్ అందించినప్పుడు పొగిడటం.. సినిమా నచ్చలేదని రిజెక్ట్ చేస్తే విమర్శించడం ఎంతవరకు సబబు?. కంటెంట్ బాగుంటే ఈ రివ్యూలు రేటింగ్స్ సినిమాని అడ్డుకోలేవు. సాధారణ ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా ఖచ్చితంగా థియేటర్లకు వస్తారు. ఇప్పుడు 'పొన్నియిన్ సెల్వన్' సినిమాకైనా అదే వర్తిస్తుంది. అంతేకానీ ఇలా తెలుగు ప్రేక్షకులను కించపరచడం.. తెలుగు సినిమాను బెదిరించడం అనేది ఏమాత్రం ఆహ్వానించదగ్గది కాదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.