టాలీవుడ్ బాక్సాఫీస్ పై తమిళ హీరోల దండయాత్ర

Sat Oct 19 2019 15:49:13 GMT+0530 (IST)

తెలంగాణలో దసరా బతుకమ్మ పెద్ద పండుగలు.. అదే ఆంధ్రాలో సంక్రాంతి పెద్ద పండుగ.. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే దసరా సంక్రాంతి గ్రాండ్ గా జరుపుకుంటారు. మరి తమిళనాట.. 'దీపావళి' ని అత్యంత ఘనంగా జరుపుకుంటారు. లక్ష్మీదేవికి పూజలు పటాసులు కాల్చడాలు ఇతర పూజలతో తమిళనాట ఈ పండుగకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. దేశంలో దీపావళికి కాల్చే టాపసుల పరిశ్రమలన్నీ తమిళనాటే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.. అలాంటి తమిళుల పెద్ద పండుగ అయిన దీపావళికి ఈసారి రెండు భారీ చిత్రాలు బరిలో ఉన్నాయి.. అవే విజయ్ నటించిన బిగిల్' తెలుగులో 'విజిల్' గా అనువాదం అవుతోంది. ఇక రెండో చిత్రం కార్తీ హీరోగా నటించి 'ఖైదీ'. ఈ రెండు సినిమాలు అక్టోబర్ 25న రెండు భాషల్లోనూ విడుదలవుతున్నాయి.టాలీవుడ్ పై తమిళ హీరోల దండయాత్ర

టాలీవుడ్ బాక్సాఫీస్ పై తమిళ హీరోలు దండయాత్ర చేస్తున్నారు. ఈ దీపావళికి తమిళంతోపాటు తెలుగులో  ఈ రెండు భారీ చిత్రాలు విడుదల అవుతున్నాయి. తెలుగులో ఒక్క స్టెయిట్ సినిమా కూడా పండుగ బరిలో లేకపోవడం మన దైర్భాగ్యం..దీంతో  తమిళ సినిమాలు తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టేలా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే తెలుగులో విడుదలైన సినిమాలకు పెద్దగా బజ్ లేకపోవడంతో తమిళ సినిమాల మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడదు.. ఈసారి తమిళ హీరోలకు తెలుగులో హిట్స్ దక్కుతాయో లేదా చూడాలి.

అమావాస్య పండుగని  దీపావళిని వదిలేస్తారా?

దీపావళి పెద్ద పండుగే.. కానీ తెలుగు నాట మాత్రం ఈ అమావాస్య పండుగను మంచిది కాదని సినీ నిర్మాతలు వదిలివేయడమే పెద్దతప్పుగా ఇండస్ట్రీ వర్గాలు మండిపడుతున్నారు. పౌర్ణమి ఇతర మంచిరోజుల్లోనే సినిమాలు విడుదల చేసేందుకు తెలుగు నిర్మాతలు మొగ్గుచూపుతారు. దసరా లేదంటే మళ్లీ డిసెంబర్ జనవరికే సినిమాలు ప్లాన్ చేస్తుంటారు. అందుకే ఇంత పెద్ద పండుగకు తెలుగునాట ఒక్క పెద్ద హీరో సినిమా కూడా లేకపోవడం.. తమిళ హీరోలు రంగ ప్రవేశం చేసి మార్కెట్ పెంచుకోవడం టాలీవుడ్ వర్గాలను డిఫెన్స్ లో పడేస్తోంది.

దీపావళిని క్యాష్ చేసుకోని తెలుగు ఇండస్ట్రీ

దసరా సెలవుల జోష్ తో ఈ సమయంలో సినిమాల విడుదలకు అంతా ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత వచ్చే దీపావళి కూడా పెద్ద పండుగే. ఇంత పెద్ద పండుగ సీజన్ లో కనీసం ఒక్క తెలుగు అగ్ర సినిమా కూడా ప్రస్తుతం లేకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. దీపావళి పండుగ మొత్తాన్ని ఈసారి ఇద్దరు తమిళ హీరోలకు ఇవ్వడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోవడం లేదు. ప్రస్తుతం తెలుగులో ఏ సినిమాలు లేకపోవడంతో దీపావళి పూట తమిళ రెండు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన పరిస్థితి టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లకు ఏర్పడింది. ఈ పరిస్థితికి కారణం మన హీరోలు దర్శకులు నిర్మాతల ప్లానింగ్ లోపమేనని చెప్పక తప్పదు. ఈ పెద్ద పండుగకు కనీసం ఒక్క హీరో అయినా సినిమా రిలీజ్ చేస్తే ఈ తమిళ సినిమాలు చూసే బాధ తెలుగు ప్రేక్షకులకు తప్పి ఉండేది.

టాలీవుడ్ లో ఐక్యత లేకపోవడమే సమస్య

తమిళనాట అగ్రహీరోలందరూ ఐక్యంగా ఉంటారు. సినిమాల పరంగా పోటీపడినా రిలీజ్ సందర్భంగా మాత్రం సినిమాల మధ్య గ్యాప్ ఉంచుకుంటారు. తద్వారా డిస్ట్రిబ్యూటర్లను బతికించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ తెలుగు హీరోల మధ్య ఇగోల సమస్యలతో ఒకటే తేదీల్లో రెండు సినిమాలు రిలీజ్ అవుతూ కలెక్షన్లకు బొక్కపెట్టుకుంటున్నారు. నిర్మాతలు హీరోలు బాగానే ఉంటున్న డిస్ట్రిబ్యూటర్లు మాత్రం నలిగిపోతున్నారు. సంక్రాంతికి పెద్ద ఎత్తున రిలీజ్ చేసే బదులు సినిమాలు లేని ఈ దీపావళికి ఒకటి రిలీజ్ చేసుకుంటే కలెక్షన్లకు కలెక్షన్లు ఉండేవి. డిస్ట్రిబ్యూటర్లు బతికేవారు.. ఇండస్ట్రీ బాగుపడేది కదా అన్న చర్చ సినీ ఇండస్ట్రీలో సాగుతోంది.

మన ఐక్యతాలోపమే తమిళ హీరోలకు వరం

సంక్రాంతికే ముగ్గురు నలుగురు పెద్ద హీరోలు బరిలోకి దిగడం వల్ల 100 రూపాయల కలెక్షన్లను 25 రూపాయల చొప్పున అందురూ పంచుకునే పరిస్థితి. అదే ఇద్దరే బరిలోకి దిగితే అందరూ బతుకుతారు కదా.. కానీ మన హీరోలు మాత్రం అలా ఎప్పటికీ చేయరు.. ఐక్యత లేకపోవడం..కలిసి ముందుకు సాగకపోవడం వల్లే ఇప్పుడు టాలీవుడ్ లోకి పరభాష చిత్రాల పరంపర కొనసాగుతోంది. తమిళ హీరోలు కన్నడ హిందీ సినిమాలు కూడా రిలీజ్ చేస్తూ మనపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. తెలుగు హీరోలతో సమానంగా తమిళ హీరోలు కలెక్షన్లు రాబడుతుండడమే అందుకు కారణంగా చెప్పవచ్చు.

హీరోలు మారాలి.. తెలుగు ఇండస్ట్రీని బతికించాలి..

మన టాలీవుడ్ హీరోలు ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. అరవ సినిమాల గోలను ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు.. వారి సినిమా రొదను ఎక్కువగా భరించరు. కానీ దీపావళి పండుగ పూట ఒక్క తెలుగు సినిమా లేక ఇప్పుడు వారి సినిమాలే చూడాల్సిన పరిస్థితి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో  పండుగ పూట తెలుగు సినిమా ఆధిపత్యం లేకపోవడం అంటే ఇంతకంటే ధౌర్భాగ్యం లేదు. మన హీరోల చర్యల వల్ల టాలీవుడ్ పై పరాయి హీరోల ఆధిపత్యం పెరుగుతోంది. పోనీ మన హీరోలు పోయి తమిళనాడులో ఇరగదీస్తున్నారంటే అదీ లేదు. ఇక్కడా లేక అక్కడా లేక ఇలా ఇగోలతో ఒకేసారి సినిమాలు రిలీజ్ చేస్తూ తెలుగు సినిమా కళామతల్లిని ఏడిపిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లను చంపుకుతింటున్నారన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. మరి ఈ పరిస్థితి మారాలంటే మన హీరోలు నిర్మాతలు ఇగోలు వీడి ఐక్యతతో సినిమాల మధ్య గ్యాప్ తీసుకొని కలెక్షన్ల కోసం నడుం బిగించాల్సిన అవసరం ఉంది.అప్పుడే ఇలా దీపావళి పూట తెలుగు సినిమాలు చూసే భాగ్యం దక్కుతుంది.