మరో అరవ దర్శకుడు చరణ్ వైపు చూస్తున్నాడా?

Thu May 19 2022 05:00:01 GMT+0530 (India Standard Time)

Tamil Director Lokesh Kanagaraj

సినిమా ఇండస్ట్రీలో లక్ అనేది ఏ సమయంలో వస్తుందో ఊహించలేం. ప్రస్తుతం తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ టైమ్ నడుస్తుంది. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు మూడు మాత్రమే. అందులో మొదటి సినిమా గురించి పెద్దగా ప్రచారం జరగలేదు.. రెండవ సినిమా ఖైదీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మూడవ సినిమా సూపర్ స్టార్ విజయ్ తో 'మాస్టర్' ను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు.మాస్టర్ విజయం తర్వాత లోకేష్ కనగరాజ్ స్థాయి అమాంతం పెరిగి పోయింది. యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ తో విక్రమ్ సినిమాను తెరకెక్కించాడు. విక్రమ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చాలా సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ కు విక్రమ్ సినిమాతో లోకేష్ కనగరాజ్ సక్సెస్ ఇవ్వబోతున్నాడు అంటూ చాలా పాజిటివ్ బజ్ విక్రమ్ కు ఉంది.

విక్రమ్ సినిమా తర్వాత లోకేష్ సినిమాల వరుస చాలా పెద్దగానే ఉంది. మొదటగా లోకేష్ ఖైదీ సీక్వెల్ ను చేయబోతున్నాడు. ఆ తర్వాత రజినీకాంత్ తో కూడా ఒక సినిమాను లోకేష్ చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. తమిళ మరో స్టార్ హీరో అజిత్ తో కూడా లోకేష్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఆ మద్య తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇంతటి జోరు లో ఆ అరవ దర్శకుడు టాలీవుడ్ వైపు చూస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కొన్నాళ్ల క్రితం లోకేష్ తెలుగు లో సినిమా కోసం కథను రెడీ చేసుకున్నాడట. ఆ కథను రామ్ చరణ్ కు సన్నిహితుల సాయంతో రామ్ చరణ్ కు వినిపించాడని సమాచారం. ఆ కథ కు చరణ్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడని.. కాని ఆ సమయంలో ఇతర సినిమాలతో కమిట్ అవ్వడం వల్ల అప్పుడు ఓకే చెప్పలేదు అనే వార్తలు వచ్చాయి.

ఇప్పుడు లోకేష్ వరుసగా సక్సెస్ లు దక్కించుకుంటున్న నేపథ్యంలో రామ్ చరణ్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని.. తప్పకుండా లోకేష్ కనగరాజ్ కు చరణ్ డేట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే పలువురు తమిళ దర్శకులు తెలుగు లో సినిమాలు చేస్తున్నారు. అదే వరుసలో లోకేష్ కనగరాజ్ కూడా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి ఎక్కువ సమయం పట్టక పోవచ్చు.

2025 వరకు లోకేష్ తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు ముచ్చటించుకుంటున్నారు. లోకేష్ విక్రమ్ తో పాటు ఆ తర్వాత సినిమా కూడా సక్సెస్ అయితే అంతకు ముందే టాలీవుడ్ లో ఎంట్రీ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి.