Begin typing your search above and press return to search.

టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ: ఆర్టిస్టుల డ‌బ్బులు మింగేస్తున్న‌ రాబందులు

By:  Tupaki Desk   |   3 Jun 2023 9:00 AM GMT
టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ: ఆర్టిస్టుల డ‌బ్బులు మింగేస్తున్న‌ రాబందులు
X
క‌ళాకారులు త‌మ వృత్తిని వ‌దిలి కూలి ప‌ని చేసేందుకు వెళ్ల‌లేరు. చావో రేవో క‌ళారంగంలోనే తేల్చుకోవాల‌నుకుంటారు. అలా చివ‌రి రోజుల వ‌ర‌కూ కుటుంబానికి అండ‌గా నిల‌వ‌లేక కాలం చేసిన చాలా మంది ఆర్టిస్టుల కృష్ణాన‌గ‌ర్ క‌థ‌లు పుంఖాను పుంఖాలుగా యూట్యూబ్ లో ఉన్నాయి. కానీ ద‌శాబ్ధ కాలంగా చిన్నా చిత‌కా పాత్ర‌ల్లో అవ‌కాశాలు అందుకుంటూ సీనియ‌ర్లు అయి ఉండీ ఇప్ప‌టికీ భ‌త్యం (పారితోషికం) స‌రిగా అందుకోలేని ఆర్టిస్టులు వంద‌లాదిగా టాలీవుడ్ లో ఉన్నార‌నే నిజం తెలిస్తే షాక్ తిన‌కుండా ఉండ‌లేం. కోఆర్డినేట‌ర్ లేదా ద‌ళారీ వ్య‌వ‌స్థ దాష్ఠీకానికి ఆర్టిస్టులు చేతులెత్తేస్తున్న వైనం తాజాగా ఓ ఆర్టిస్టుల సంఘంలో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అసోసియేష‌న్ త‌ర్వాత అంత పెద్ద అసోసియేష‌న్ గా రూపొంది దాదాపు 900 మంది ఆర్టిస్టుల‌తో అతి పెద్ద సంఘంగా ఎదిగిన తెలుగు మూవీ టీవీ ఆర్టిస్టుల సంఘం టీఎంటిఎయు (ఇటీవ‌ల తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టుల సంఘంగా మార్చారు)లో చాలా మంది ఆర్టిస్టులు త‌మ‌కు మ‌ధ్య‌వ‌ర్తులు స‌రిగా పేమెంట్లు చేయ‌డం లేద‌ని నివేదించ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఆ మేర‌కు స‌ద‌రు న‌ష్ట‌పోయిన ఆర్టిస్టులు మ‌ధ్య‌వ‌ర్తులు ద‌ళారులు త‌మ‌ను ఎలా మోసం చేసారో టీఎంటీఏయు అధ్య‌క్షుడికి లేఖ‌లు రాయ‌డంతో ఇప్పుడు అది విస్త్ర‌తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ లేఖ‌ల‌పై Tmtau జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ గోవింద్ శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. ఈ మ‌ధ్య‌వ‌ర్తులు లేదా ఆర్టిస్టుల కోఆర్డినేట‌ర్ల వ్య‌వ‌స్థ‌పై అత‌డు సుతిమెత్త‌గా చీవాట్లు వేసిన వైనం చ‌ర్చ‌కు వ‌చ్చింది. అసోసియేష‌న్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ గోవింద శ్రీ‌నివాస్ మాట్లాడుతూ..''నేను ఒక విషయం అందరికి చెప్పాలనుకుంటున్నాను..నేను చెప్పేది కొంద‌రికి నచ్చొచ్చు.. కొంద‌రికి నచ్చకపోవచ్చు.. ఏదైనా ఒక విషయాన్ని ముక్కు సూటిగా చెప్తే ఎవరికీ నచ్చదు.. ఐనా సరే చెప్పక తప్పదు..మన బంగారం కరెక్టుగా ఉంటే వేరే వాళ్ళని ఆనాల్సిన పని ఉండద‌నేది నా అభిప్రాయం..ఏదైనా ఒక సమస్య ఎవరికైనా వస్తే అది వారి సొంతం ఐతే వారితో మనకి ఇబ్బంది లేదు.

అది ఒక సంఘానికో సమూహానికో వస్తే దానిమీద తప్పకుండా చర్చించాలి.. ప్రస్తుతం మన ముందున్న పెద్ద సమస్య ఈ కోఆర్డినేటర్స్.. కోఆర్డినేటర్ అనే వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళకి అవకాశాలు ఎవరు ఇస్తారు? ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ అర్హతలు ఏంటి? వాళ్ళతో మనం (ఆర్టిస్టులు) పని ఎందుకు చేయాలి? వాళ్ళతో మనం పని చెయ్యకపోతే వాళ్లు ఎవరితో పని చేస్తారు? ఇవన్నీ ఆలోచించకుండా కోఆర్డినేటర్ పిలిచాడు.. సర్..సర్ అని ఒక పనికి*రాని వ్యక్తి వెనక తిరగాల్సిన దుస్థితి ఆర్టిస్ట్ కి ఎందుకు వచ్చింది? కో డైరెక్టర్స్- మేనేజర్స్ దేనికి ఉన్నది? వాళ్ల వర్క్ ఏంటి? వాళ్ళు చేస్తున్నది ఏంటి? అసలు ఆఫీసులో ఏం జరుగుతోంది? ఇవన్నీ ప్రొడ్యూసర్ అనే వ్యక్తికి తెలిసి ఉండొచ్చు.. కొన్ని తెలియక పోవచ్చు..అక్కడ జరిగే విషయాలు ప్రొడ్యూసర్స్ వరకు వెళ్ళాలి అంటే డిపార్ట్మెంట్ లో కోడైరెక్టర్స్.. మేనేజర్లు చొర‌వ తీసుకుని ఏదో ఒక‌టి చేయాలి.

ప్రొడ్యూసర్ కి తెలియాలి అంటే కోఆర్డినేటర్స్ ని బాయ్ కాట్ చెయ్యాలి. దీనికోసం ఆర్టిస్టులంతా ఐక్య‌మ‌వ్వాలి. వాళ్ళు పిలిస్తేనో.. వాళ్ళకి మన నంబర్స్ ఇస్తేనో మేము రాము అని చెప్పగలిగిన రోజు ఈ సమస్యలు రావు..ఉన్న ఆర్టిస్ట్స్ ల‌ను విభ‌జిస్తూ కోఆర్డిఏట‌ర్ ఒకడు వీళ్ళు నా ఆర్టిస్టులు అని... ఇంకోడు నా ఆర్టిస్టులని అంటాడు.. ఆర్టిస్టులని పంచుకుడానికి వీళ్ళు ఎవరు? వాడికి వీడికి ఎందుకు ఊడిగం చెయ్యాలి? ఆర్టిస్ట్స్ లో చలనం రానంత వరకు ఈ సమస్యకి సమాధానం రాదు..తప్పు మన దగ్గర పెట్టుకొని వాళ్ళని అనడం కరెక్ట్ కాదు..వాళ్ళకి ఊతం ఇచ్చింది మనం.

వాళ్ళకి సలాం కొడుతోంది మనం. వాళ్ళకి బలాన్ని ఇచ్చి బలగంగా మారింది మనం. అది మర్చిపోయి పని చేసినన్నాళ్ళు చేసేసి.. న‌ష్టం వ‌చ్చాక వస్తే యూనియన్ అండ కావాలి? యూనియన్ కి ఆర్టిస్ట్ వల్ల వచ్చిన లాభం ఏంటి? వేరే యూనియన్స్ లాగా అందరి దగ్గరా ఫండ్స్ కలెక్ట్ చెయ్యడం లేదు. ఎటువంటి డిమాండ్స్ లేవు. కానీ యూనియన్ నుంచి అన్ని కావాలి అని కోరుకుంటారు..యూనియన్ అన్నది అందరిది..దానిని నడిపించడానికి ఒక కమిటీ ఉన్నా యూనియన్ మనుగడ అందరి బాధ్యత..అది కమిటీ ఒక్కరిదే కాదు..యూనియన్ నడవాలి అంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి..వాటిని అధిగమించాలి అంటే అందరం ఒక తాటి మీదకి వచ్చినప్పుడే సాధ్యం..యూనియన్ లో కార్డ్ తీసుకున్న ప్రతి ఆర్టిస్టుకి న్యాయం జరగాలి అంటే మనం బలోపేతం కావాలి.

మన సమస్యలని ప్రొడ్యూసర్స్ వరకు తీసుకెళ్లాలి..అప్పుడే మనకి సరైన పని.. పనికి తగ్గ పారితోషకం వస్తుంది..ప్రొడ్యూసర్ కి ఎంతో మేలు జరుగుతుంది..మన అన్నదాతకు మన సమస్య చెప్పుకుందాం.. మధ్యలో ఉన్న రాబందులని తరిమి కొడదాం. ఆలోచన లో మార్పు వస్తే కానీ..వీటన్నిటికి సమాధానం దొరకదు..మార్పు కావాలి అంటే అది ఒకరినుంచే స్టార్ట్ కావాలి. ఎవరికి వారు సిద్ధం ఐతే కానీ అది సాధ్య పడదు..సర్వేజనా సుజనోభవన్తు! .. అంటూ సుదీర్ఘ‌మైన అనుభ‌వంతో వివ‌ర‌ణ ఇచ్చారు.

జనరల్ సెక్రెటరీ శ్రీ గోవింద శ్రీనివాసు గారు వెలిబుచ్చిన అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను అంటూ మెజారిటీ ఆర్టిస్టులు దీనికి ప్ర‌తిస్పందించ‌డం స‌మ‌స్య తాలూకా తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. అత‌డు చెప్పిన దాంట్లో నూటికి నూరు పర్సెంట్ నిజం ఉన్నది. మన కళాకారులు సహృదయంతో మన జనరల్ సెక్రెటరీ గారు వెలిబుచ్చిన అభిప్రాయం ప్రకారం కళాకారులందరూ ఒక మాట మీద ఒక బాట మీద నడిస్తే చాలావరకు సమస్యలు రాకుండా ఉండేందుకు ఆస్కారము ఉంది.

అలాగే మన యూనియన్ కోర్ కమిటీ సభ్యులు ఈసీ మెంబర్స్ అందరూ కలిసి కళాకారులకు జరుగుతున్న అన్యాయాన్ని నిర్మాతల దృష్టికి తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నామ‌ని ఆర్టిస్టులు వాట్సాప్ గ్రూప్ వేదిక‌గా తీర్మానించారు. చిన్నా చిత‌కా వేషాలు వేసుకునే స‌హాయ న‌టులు .. జూనియ‌ర్ ఆర్టిస్టుల పొట్ట గొట్టేందుకు మ‌ధ్య‌లో ఒక ద‌ళారీ వ్య‌వ‌స్థ అనేది ఉంది. దాని అంతం కోసం ఏందాకా అయినా వెళ్లాల‌ని ఆర్టిస్టుల్లో ఇప్పుడు పూన‌కాలు రావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.