ఎన్టీఆర్ - ప్రభాస్ లకు తలసాని చాలెంజ్

Fri Aug 10 2018 15:35:30 GMT+0530 (IST)

తెలంగాణలో ‘గ్రీన్ చాలెంజ్’కు విశేషమైన స్పందన వస్తోంది. ఈ మధ్య కేసీఆర్ కూతురు ఎంపీ కవిత.. మహేష్ బాబుకు ‘గ్రీన్ చాలెంజ్’ విసరగా.. ఆయన మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి చాలెంజ్ చేశారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కూడా గ్రీన్ చాలెంజ్ ఎదురైంది. ఎస్సీ - ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విసిరిన చాలెంజ్ ను స్వీకరించిన తలసాని శుక్రవారం ఆయన ఇంటి ఆవరణలో మూడు మొక్కలు నాటారు. అనంతరం స్టార్ హీరోలు ప్రభాస్ - ఎన్టీఆర్ - నిర్మాత దిల్ రాజు - దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కు ఈ గ్రీన్ చాలెంజ్ విసిరారు.. తన సవాల్ ను స్వీకరించి మూడు మొక్కలు నాటాలని కోరారు..మొక్కలు నాటిన అనంతరం తలసాని మాట్లాడారు. హరిత హారం పేరుతో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని కోట్ల మొక్కలను ఇప్పటికే నాటామని తెలిపారు. భవిష్యత్ తరాల కోసం విధిగా మొక్కలు అందరూ నాటాలని పిలుపునిచ్చారు. అందరికీ ఆక్సిజన్ అందాలంటే ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాలుపంచుకోవాలని .. వాటిని సంరక్షించాలని కోరారు.