ఫస్ట్ లుక్: అల వైకుంఠపురములో టబు

Tue Aug 20 2019 15:46:26 GMT+0530 (IST)

Tabu and Jayaram Look in Allu Arjun Ala Vaikunthapuram Lo

సీనియర్ హీరోయిన్లు చాలామందే ఉంటారు కానీ టబుకు వారందరిలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.  అందం మాత్రమే కాకుండా అద్భుతమైన నటన కూడా ఆమె సొంతం. అటు బాలీవుడ్ నుండి ఇటు టాలీవుడ్ వరకూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన టబుకు భారీ ఫాలోయింగ్ కూడా ఉంది. బాలీవుడ్ లో కంటిన్యూగా నటిస్తూనే ఉన్నప్పటికీ టబు తెలుగులో చాలారోజుల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది.  దీంతో టబు రీ ఎంట్రీ పై ఆసక్తి నెలకొంది.ఈ సినిమాలో మలయాళం హీరో జయరామ్ కు టబు జోడీగా నటిస్తోంది.  అల్లు అర్జున్ పాత్రకు వీరిద్దరూ తల్లిదండ్రులుగా నటిస్తున్నారని వార్తలు వినిపించాయి కానీ వాటిపై ఇంకా క్లారిటీ రాలేదు.  అయితే తాజా జయరామ్ - టబు ల ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది.  ఇందులో జయరామ్ సూటు బూటులో ఉండగా టబు గ్రే - బ్లూ కలర్స్ కలిసిన చీరలో ఎంతో గ్రేస్ ఫుల్ గా కనిపిస్తున్నారు. నలభై ఏడేళ్ళ వయసులో కూడా అదే గ్రేస్.. అదే ఛార్మ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నారు.  మరోవైపు జయరామ్ కూడా మంచి స్మైల్ తో పోజివ్వడం విశేషం.  సినిమా అనగానే హీరో - హీరోయిన్ ల జోడీ అనుకుంటాం కానీ ఇలా సీనియర్ ఆర్టిస్ట్ ల జోడీని కూడా పర్ఫెక్ట్ గా సెట్ చేయడం గురూజీలాంటి వారికే సాధ్యం.

ఈ మూవీలో జయరామ్ -టబు జోడీ ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా మారుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.  ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.  నివేద పేతురాజ్.. సుశాంత్.. నవదీప్.. సత్యరాజ్.. రాజేంద్ర ప్రసాద్.. రాహుల్ రామకృష్ణ.. బ్రహ్మాజీ.. సునీల్.. తదితరులు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.  థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. గీతా ఆర్ట్స్.. హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సీజన్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.