Begin typing your search above and press return to search.

అలా మాట్లాడారంటూ హీరో సూర్య తండ్రిపై కేసు

By:  Tupaki Desk   |   7 Jun 2020 5:43 AM GMT
అలా మాట్లాడారంటూ హీరో సూర్య తండ్రిపై కేసు
X
తమిళ హీరో సూర్యను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన తండ్రి శివకూమార్ మీద తాజాగా కేసు నమోదైంది. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి? అన్నది ప్రశ్నగా మారింది. తిరుమల కొండపై స్వామి దర్శనాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సరిగా లేవంటున్నారు. అదే ఆయనపై కేసు నమోదుకు కారణమంటున్నారు. ఇంతకీ ఆయనేం మాట్లాడారు? ఆ విషయం టీటీడీకి ఎలా తెలిసింది? అన్న వివరాల్లోకి వెళితే..

రెండు నెలల క్రితం ఒక చిన్న సమావేశంలో పాల్గొన్న సూర్య తండ్రి శివకుమార్ తిరుమల కొండపై జరుగుతున్న అక్రమాలపై కొన్ని విమర్శలు చేశారు. కొండ మీద డబ్బులు ఉన్న వారికి.. ధనవంతులకు మాత్రమే దర్శనాలకు వీలుందని.. పేదోళ్లు నడుచుకుంటూ వెళితే దర్శనం వేళ అమాంతం తోసేస్తారని వ్యాఖ్యానించారు. డబ్బున్నోళ్లు భార్యకు తెలీకుండా వేరేవారితో వచ్చి దర్శనాలు చేసుకుంటారు. వీలైతే మద్యం సేవించి ఆలయంలోకి వెళతారు.. లాంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. డబ్బులున్న వారికి మాత్రమే దర్శనాలు.. గెస్టు హౌస్ లు ఇస్తారని.. సామాన్యులకు అలాంటివేమీ ఉండవన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాంటప్పుడు తిరుమల ఆలయానికి ఎందుకు వెళ్లాలంటూ విమర్శలు చేశారు.

ఈ ప్రసంగానికి సంబంధించిన ఒక వీడియోను తమిళనాడుకు చెందిన మరియప్ప అనే వ్యక్తి టీటీడీకి మొయిల్ ద్వారా పంపారు. దీనిపై తిరుమల విజిలెన్స్ విభాగం ప్రాథమిక విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇదే కాదు.. ఇటీవల కాలంలో టీటీడీ బోర్డులో సభ్యురాలిగా వ్యవహరిస్తున్న ఇన్పోసిస్ సుధా నారాయణమూర్తి రాజీనామా చేశారని కొందరు.. జూన్ మొత్తం ఆలయాన్ని మూసి ఉంచుతారంటూ మరికొందరు రూమర్లు పుట్టించారు.

అలాంటి వాటికి కారణమైన వారిపైనా కేసుల్ని నమోదు చేశారు. టీటీడీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి.. హీరో సూర్య తండ్రి చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు ఉంటాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.