కెలికితే ఊరుకోవడానికి ఓటరు కాదు.. వర్మ

Mon Apr 15 2019 16:20:05 GMT+0530 (IST)

TDP Leaders Case Filed Against Ram Gopal Varma

‘పిచ్చోడి చేతిలో రాయి.. వర్మ చేతిలో సోషల్ మీడియా..’ ఇప్పుడీ కామెంట్లు  సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. వర్మకు పిచ్చి ఉందో లేదో తెలియదు కానీ.. ఆయనకు టీడీపీపై కావాల్సినంత పగ - ప్రతీకారం మాత్రం ఉంది. తను ఏరీకోరి.. ముచ్చటగా తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను ఏపీలో ఎన్నికలకు ముందు విడుదల కాకుండా అడ్డుకున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని వర్మ టార్గెట్ చేశారు. సంధు దొరికితే చాలు.. తన ట్విట్టర్ ఖాతాలో ఏకిపారేస్తున్నారు. సందర్భం దొరికిన ప్రతీసారి టీడీపీని బెంబేలెత్తించే ట్వీట్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వైసీపీకి సపోర్టుగా నిలిచే సోషల్ మీడియా పేజీలు - యాక్టివిస్టుల కంటే ఘోరంగా వర్మ తయారయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదని టీడీపీ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు.టాలీవుడ్ లో వర్మ లాంటి ఒక ఎత్తి చూపే వ్యక్తి ఒకరు ఉంటే చాలని కొన్ని అసమ్మతి వర్గాలు కోరుకునేవి. కానీ ఇప్పుడది శృతి మించింది. వరుస ట్వీట్లతో వర్మ చేస్తున్న రచ్చకు టాలీవుడ్ - రాజకీయ వర్గాలు బెంబేలెత్తిపోతున్నాయి. టీడీపీ  ఏకంగా హైదరాబాద్ లో తాజాగా వర్మ పై పోలీస్ కేసు పెట్టేదాకా పరిస్థితి వెళ్లింది.

వర్మ ఇటీవల వైసీపీకి సపోర్టుగా టీడీపీని - బాబు - లోకేష్ ను టార్గెట్ చేసి ట్విట్టర్ లో షేర్ చేస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. కించపరిచేలా ఉన్న ఈ పోస్టులతో టీడీపీ పరువు పోతోంది. వర్మ టీడీపీనే కాదు.. పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన అలీని అసలైన హీరో అని పొగడడం.. ఏపీ ఎన్నికల్లో చిత్రవిచిత్రమైన వేశాలు వేసిన కేఏపాల్ ను కామెడీ పొలిటిషీయన్ గా అభివర్ణిస్తూ సెటైర్లు వేయడం.. ఇలా వర్మ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. తాజాగా టీడీపీపై చేసిన పోస్టులకు గాను వర్మ పై సైబర్ కేసు పెట్టారు టీడీపీ నేతలు.

వర్మ ఇంటెన్షన్ ఏది అయినా కానీ.. శృతిమించిన ఆయన పోస్టులు మాత్రం టీడీపీని ఇతర వర్గాలను తీవ్రంగా అవమానాల పాలు చేస్తున్నాయి. కానీ తనను రెచ్చగొడితే.. మీరే నష్టపోతారన్న చందంగా వర్మ తీరుంది.. రివర్స్ గేర్ లో అటాక్ చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా అకౌంట్లను మించి పనిచేస్తూ జగన్ కు వెన్నుదన్నుగా నిలబడుతున్నాడు వర్మ. వర్మ దూకుడు అటు టాలీవుడ్ ను ఇటు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది.