మావాడికి పెళ్లాంగా హీరోయిన్ మాత్రం వద్దు

Fri Apr 19 2019 19:57:35 GMT+0530 (IST)

T. Rajendar talks about actor STR marriage ft Kuralarasan

తమిళ స్టార్ హీరో శింబు సోదరుడు కురలరాసన్ వివాహం ఈనెల 26న జరుగబోతుంది. కొడుకు పెళ్లికి టి రాజేందర్ హడావుడి చేస్తున్నాడు. ప్రముఖుల వద్దకు స్వయంగా వెళ్లి పెళ్లి ఆహ్వాన పత్రికలు అందించడంతో పాటు పెళ్లి ఏర్పాట్లలో మునిగి పోయాడు. కురలరాసన్ ముస్లీం అమ్మాయినని వివాహం చేసుకోబోతున్న విషయం తెల్సిందే. ముస్లీం యువతిని ప్రేమించిన కురలరాసన్ ముస్లీం మతం స్వీకరిస్తేనే పెళ్లికి అమ్మాయి కుటుంబం ఒప్పుకున్నారు. ఇటీవలే ముస్లీం మతం స్వీకరించాడు. తన కొడుకు ప్రేమించిన అమ్మాయి కోసం మతం మార్చుకున్నాడు అది అతడి అభిప్రాయం. నేను అతడిని కాదనలేను అంటూ టీ రాజేందర్ అంటున్నాడు. ఇదే సమయంలో శింబు పెళ్లికి సంబంధించి రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్ కు తనయుడి వివాహ ఆహ్వాన పత్రికను అందించిన రాజేందర్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్బంగా శింబు పెళ్లి గురించి మాట్లాడుతూ.. త్వరలోనే శింబుకు ఇష్టమైన అమ్మాయి లభించాలని కోరుకుంటున్నాను. శింబు ఎవరిని ఇష్టపడితే వారితో ఇచ్చి పెళ్లి చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్లుగా ప్రకటించాడు. అయితే శింబుతో గతంలో నటించిన హీరోయిన్స్ మాత్రం అతడికి భార్యగా వద్దనుకుంటున్నాను అన్నాడు. గత అనుభవాల దృష్ట్యా రాజేందర్ తన కొడుకుకు హీరోయిన్ పెళ్లాంగా వద్దని భావిస్తూ ఉండవచ్చు.

శింబు కొన్ని సంవత్సరాల క్రితం నయనతారతో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయాడు. పెళ్లికి కూడా అంతా ఒప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల నయన్ తో విడిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో హీరోయిన్ హన్సికతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరికి కూడా పెళ్లి త్వరలో అవ్వడం ఖాయం అంటూ వార్తలు వచ్చాయి. అయితే రెండవ సారి కూడా శింబు బ్రేకప్ అయ్యాడు. ఇద్దరు హీరోయిన్స్ తో కూడా శింబుకు వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఈసారి హీరోయిన్స్ వద్దని శింబు తండ్రి భావిస్తున్నాడు. మరి శింబు మనసులో ఏముందు చూడాలి.