ఫస్ట్ గ్లింప్స్ : స్వాతిముత్యం వర్జిన్ కాదా..?

Sat Jan 15 2022 18:46:00 GMT+0530 (India Standard Time)

SwathiMuthyamGlimpse out now

స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఆయన నటిస్తున్న చిత్రం `స్వాతిముత్యం`. సరికొత్త కథ కథనాలతో రూపొందుతున్న ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ద్వారా లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్ శనివారం విడుదల చేశారు. రావు రమేష్ ప్రగతి సీనియర్ నరేష్ సురేఖా వాణి కీలక పాత్రల్లో నటించారు. హీరోగా బెల్లంకొండ గణేష్ కిది తొలి మూవీ. ఇందులో తను అమాయకుడిగా కనిపించే పాత్రలో నటిస్తున్నాడు. అందుకే ఈ చిత్రానికి `స్వాతిముత్యం` అని పేరు పెట్టినట్టుగా తెలుస్తోంది. హీరో ఎంత అమాయకుడంటే హీరోయిన్ తండ్రి కాళ్లు కడిగేంత.

`ఎరా అమ్మాయిని కలిశావా?.. పంతులు గారితో ఇప్పుడే మాట్లాడానూ.. అమ్మాయి వాళ్ల నాన్నకి కొంచెం పట్టింపులెక్కువ.. పద్దతి అదీ ఇదని బుర్రతినేత్తాడేంటీ? .. అంటూ రావు రామేష్ వాయిస్ తో గ్లింప్స్ మొదలైంది. హీరోయిన్ తల్లితో సెల్ఫీ దిగుతూ ముద్దు పెట్టడం గమనించిన హీరో అదే తరహాలో తన తండ్రి రావు రమేష్ తో సెల్ఫీ తీసుకుంటూ ముద్దు పెట్టడం... ఏంటిదీ... అంటూ రావు రమేష్ గణేష్ ని మందలించడం... సినిమాలో గణేష్ పాత్ర ఎలా వుండబోతోందో తెలియజేస్తోంది.

ఇక హీరోయిన్ నువ్వు వర్జినా.. అంటూ హీరోని ముఖం మీదే అడిగేయడం.. అందుకు హీరో .. అంటే అదీ.. అంటూ నసిగేయడం.. కాళ్లు కడగాలని చెప్పడంతో హీరో తనకు కాబోయే మామ నరేష్ కాళ్లు కడిగేయడం... అది చూసి షాకైన రావు రమేష్ `యదవ యదవ సన్నాసి నువ్వు కాదు ఆళ్లు నీ కాళ్లు కడగాలి.. ఈడు నా పరువు తీసేత్తున్నాడే.. ` అని మండిపడటం.. దానికి కౌంటర్ గా కాళ్లు ఎవరు కడిగితే ఏంటి నాన్నా అని అమాయకంగా హీరో అనడం నవ్వులు పూయిస్తోంది.  

గ్లింప్స్ చూస్తుంటే సినిమా కొత్తగా ఆద్యంతం నవ్వులు పూయిస్తూ సాగేలా కనిపింస్తోంది.  బెల్లంకొండ గణేష్ కు ఈ మూవీతో హిట్ గ్యారెంటీ అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. బెల్లంకొండ గణేష్ కిది తొలి సినిమానే అయినా ముందు పవన్ సాదినేని డైరెక్షన్ లో ఓ సినిమాని మొదలుపెట్టారు. ఎందుకో ఏమో తెలియదు కానీ దాన్ని మధ్యలోనే ఆపేసి ఈ మూవీని పట్టాలెక్కించారు.