షూట్ వేళ పవన్ తీరుతో కన్నీళ్లు ఆగేవి కావట!

Sun Jul 14 2019 10:37:22 GMT+0530 (IST)

Supriya Explains About Pawan kalyan

సినిమా రంగానికి చెందిన రెండు పెద్ద కుటుంబాలకు చెందిన నట వారసులు ఒకేసారి.. ఒకేసినిమాతో ఎంట్రీ ఇవ్వటం ఒక ఎత్తు అయితే.. జత కట్టటం మరో ఎత్తు. ఆ సిత్రం పవన్.. సుప్రియా చేసిన అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయితో సాధ్యమైందని చెప్పాలి. చిరంజీవి తమ్ముడు.. అక్కినేని నాగేశ్వరరావు మనమరాలు జంటగా నటిస్తున్న సినిమాగా అందరి దృష్టి పడేలా చేసింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఈ సినిమా మీద జరిగిన చర్చ అంతా ఇంతా కాదు.ఆ తర్వాత ఈ జంట మళ్లీ సినిమా చేసింది కాదు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ సినిమా తర్వాత సుప్రియా పెద్దగా కనిపించకపోవటం.. తర్వాత సినిమాలు ఆపేయటం ఒక ఎత్తు అయితే.. ఈ సినిమా తర్వాత నెమ్మదిగా విజయాల్ని తన ఖాతాలో వేసుకుంటూ పవన్ పవర్ స్టార్ గా మారటం మరో ఎత్తు. ఆయన సినిమాల నుంచి రాజకీయాలకు షిఫ్ట్ అయిన వేళలో.. సుప్రియా మళ్లీ తెర మీద కొత్త తరహాలో గూఢాచారి చిత్రంతో పరిచయం కావటం తెలిసిందే.

పవన్ గురించి పెద్దగా మట్లాడని సుప్రియా.. తాజాగా ఆమెకొన్ని ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. తామిద్దరం కలిసి నటించిన అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి చిత్రం కోసం పవన్ చాలా కష్టపడ్డారన్నారు. చేతులపై కార్లు ఎక్కించుకొని.. ఛాతీపై రాళ్లు పగలకొట్టించుకొని చాలా శ్రమ తీసుకున్నారన్నారు. చేతులపై కార్లు ఎక్కించుకుంటాడు అన్నప్పుడు డూప్ పెట్టో.. కెమేరా ట్రిక్ తో చేస్తారనుకుంటే నిజంగానే కార్లు వచ్చి ఒకటి తర్వాత మరొకటి చేతులపై ఎక్కుతున్నప్పుడు కళ్లల్లో నుంచి కన్నీరు ఆగలేదన్నారు. కాసేపు తనకేమీ అర్థంకాలేదని చెప్పుకున్నారు. పవన్ రియల్ గానే పవర్ స్టార్ అన్న వైనం ఆమె మాటల్ని విన్నప్పుడు నిజమనించకమానదు.