వారికి సూపర్ మ్యూజిక్ వీరికి సోసో మ్యూజిక్!

Wed Nov 06 2019 11:52:35 GMT+0530 (IST)

Super music for them Soso Music For Others

టాలీవుడ్ లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరంటే దేవీ శ్రీ ప్రసాద్.. థమన్ పేర్లు చెప్పుకోవాలి.  ఈమధ్య దేవీ జోరు కాస్త తగ్గింది కానీ థమన్ మాత్రం చార్ట్ బస్టర్ ట్యూన్స్ తో దూసుకు పోతున్నాడు.  అయితే థమన్ భయ్యాపై ఒక కంప్లయింట్ ఉంది.. అందేంటంటే ఒక్కొకరికి ఒక్కోరకమైన అవుట్ పుట్ ఇస్తాడని అంటున్నారు.ఈమధ్య థమన్ సంగీతం అందిస్తున్న కొత్త సినిమాల విషయమే తీసుకుంటే అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురములో' సినిమానుండి రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. రెండూ సూపర్ సక్సెస్. ఈలెక్కన బన్నీ సినిమాకు థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడనే విషయం అర్థం అవుతోంది.  అయితే థమన్ సంగీతం అందిస్తున్న మిగతా సినిమాల విషయంలో ఇదే క్వాలిటీ ఈ స్థాయిలో లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.  రవితేజ-వీఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'డిస్కో రాజా' సినిమానుండి కూడా ఒక సింగిల్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ సోసోగానే ఉంది.  ఇక మారుతి-సాయిధరమ్ తేజ్ సినిమా 'ప్రతిరోజు పండగే' నుండి కూడా ఒక సాంగ్ రిలీజ్ అయింది.  ఈ పాట బాగుంది కానీ ఆల్బంలో ఉన్న బెస్ట్ సాంగ్ ను మొదట రిలీజ్ చేశారనే టాక్ ఉంది.  ఇక 'వెంకీమామ' ఆడియోపై ఎవరికీ పెద్దగా అంచనాలయితే లేవు.

దీంతో థమన్ పిండికొద్దిరొట్టె అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడని.. పెద్ద హీరోల సినిమాలకు ఒక రకంగా మీడియం రేంజ్ హీరోలకు మరో రకంగా సంగీతం అందిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.  బన్నీకి చక్కగా కాపీ కొట్టి మిగతావాళ్ళకు సొంతంగా మ్యూజిక్ ఇచ్చాడేమో అని కొందరు నెటిజన్లు సెటైర్లు కూడా వేస్తున్నారు.