స్వరూపానంద దగ్గరకు వెళ్లలేదు: సింగర్ సునీత

Tue Jun 11 2019 20:53:40 GMT+0530 (IST)

Sunitha sensational comments on Swami Swaroopananda

తన పాటలతో ఎంతో మందిని మెప్పించారు ప్రముఖ సింగర్ సునీత. ఎన్నో పాటలకు మధురమైన స్వరంతో ప్రాణం పోశారు. అందుకే ఎందరినో తన వైపునకు తిప్పుకున్నారు. వృత్తి పరంగానే కాదు.. నిజ జీవితంలోనూ ఆమె క్రమశిక్షణతో ఉంటారు. తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టడానికి అస్సలు ఇష్టపడరు. అయితే - తనపై ఏదైనా రూమర్ వస్తే మాత్రం అస్సలు పట్టించుకోరు. అలాంటి మృదు స్వభావి సునీతకు ఇటీవల ఓ విషయంలో చిర్రెత్తుకొచ్చిందట. ఇంకేముందు అందుబాటులో ఉన్న సోషల్ మీడియా అనే సాధనం ద్వారా దానిపై స్పందించేశారు.కొద్దిరోజుల క్రితం శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఓ ప్రముఖ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలను పంచుకున్నారు. తన అసలు పేరు ఏమిటి..? ఎందుకు తాను స్వామీజీగా మారారు..? శారదా పీఠాన్ని ఎందుకు స్థాపించారు..? అనే విషయాలను సవివరంగా వెల్లడించారు. ఇదే సమయంలో తన వద్దకు సినీ పరిశ్రమకు చెందిన సూపర్ స్టార్ రజనీకాంత్ - మెగాస్టార్ చిరంజీవి సహా ఎందరో నటులు వస్తారని - వారితో పాటే ప్రముఖ సింగర్ సునీత కూడా వస్తుంటారని చెప్పారు.

 ఈ వ్యాఖ్యలే సునీతకు కోపం తెప్పించాయి. దీనిపై ఆమె సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘‘నిత్యం ఎన్నో రూమర్లు వస్తూ ఉంటాయి. కానీ వాటిపై నేను స్పందించను. అయితే కొన్నింటిపై మాత్రం తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అందుకే స్వరూపానంద సరస్వతి నా విషయంలో చేసిన కామెంట్ల గురించి స్పందిస్తున్నాను. ఆయన చెప్పినట్లు శారదా పీఠానికి నేను ఎప్పుడూ వెళ్లలేదు. అసలు నేనుప్పుడూ ఆయనను కలవలేదు. అలాంటప్పుడు ఆయన వద్దకు వెళ్లానంటూ నా పేరు ఎలా ప్రస్తావిస్తారు..? అది కూడా ఓ జాతీయ చానెల్ లో’’ అంటూ సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టాలీవుడ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో దీనిపైనే చర్చ జరుగుతోంది.