#సునీల్.. తన సినిమాని తనే కాపీ చేస్తున్నాడా ఏంటీ?

Sun Feb 28 2021 13:34:36 GMT+0530 (IST)

#Sunil? .. Are you copying your own movie?

గత కొన్నేళ్లుగా హాస్య నటుడు సునీల్ కెరీర్ స్ట్రగుల్ గురించి తెలిసినదే. హీరోగా అవకాశాలు తగ్గడంతో తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు క్యారెక్టర్లు పోషిస్తూ అభిమానులను అలరించే ప్రయత్నం చేశారు. కానీ ఏదీ ఆశించినంతగా కలిసి రాలేదు. ఇప్పుడు హిట్టు పడాల్సిన టైమ్ వచ్చింది. ఓవైపు అల్లరి నరేష్ నాంది సినిమాతో హిట్టందుకుని కంబ్యాక్ అవ్వడంతో సునీల్  లో కూడా జోష్ పెరిగినట్టే కనిపిస్తోంది.ఆ క్రమంలోనే అతడు `మార్యాద కృష్ణయ్య` అంటూ తెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. టైటిల్ బావుంది.. కాకపోతే తన సినిమాని తానే కాపీ చేస్తున్నాడా ఏంటీ? అంటూ సెటైర్లు పడిపోతున్నాయి. పోస్టర్ కూడా ఇంచుమించు సేమ్ డిట్టో దించేయడంతో ఇదేమైనా మర్యాద రామన్న సీక్వెలా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇంతకుముందే ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. హీరోగా తన కెరీర్ కి మాంచి ఊపు తెచ్చిన మూవీ అది. రాయలసీమ సాంప్రదాయాల నేపథ్యంలో బోలెడంత ఫన్ ని జనరేట్ చేసి అందులోనే లవ్ స్టోరీతో రాజమౌళి మర్యాద రామన్న చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పుడు మరోసారి ఆ టైటిల్ స్ఫూర్తితోనే మర్యాద కృష్ణయ్య అనే టైటిల్ ని ఎంచుకున్నాడని అర్థమవుతోంది. కానీ ఈసారి ఏమవుతుందో? అంటూ ముచ్చట సాగుతోంది.

మర్యాద రామన్నలో ఉన్నంత వెయిట్ ఈ మూవీలో ఉంటుందా? అన్నదే ఇప్పటికి సస్పెన్స్. మనసంతా నువ్వే లాంటి బ్లాక్ బస్టర్  తెరకెక్కించిన సీనియర్ దర్శకుడు వీ.ఎన్.ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీఎన్ కి మాంచి హిట్టొచ్చి చాలా ఏళ్లు అయిపోయింది. అందుకే సునీల్ -వీఎన్ ఆదిత్య బృందం ఈసారి ఎలాగైనా కంబ్యాక్ అవ్వాలనే పంతంతో ఈ ప్రయత్నం చేస్తున్నారట. సునీల్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేశారు. సునీల్ ఈ మూవీలో దొంగగా నటిస్తున్నాడు. ఇంట్లోకి ఆహ్వానించేంతటి గొప్ప దొంగ అని చెబుతున్నారు మరి. మునుముందు తదుపరి ప్రచారం హోరెత్తనుందట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ- ఏఏఏ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత.