సుకుమార్ లాంచ్ చేసిన బ్యూటిఫుల్ 'బెనారస్' మెలోడీ.. 'మాయ గంగ'..!

Tue Jun 28 2022 20:24:26 GMT+0530 (IST)

Sukumar Launched First Single Maayaganga From Pan India Film Banaras

సమీర్ అహ్మద్ ఖాన్ తనయుడు జైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ''బనాసర్''. వారణాసి నేపథ్యంలో దర్శకుడు జయతీర్థ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో జైద్ ఖాన్ సరసన సోనాల్ మొనితిరో హీరోయిన్ గా నటించింది. ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.ఇప్పటికే రిలీజ్ చేయబడిన ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ 'మాయ గంగా' అనే సాంగ్ ని విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ రొమాంటిక్ డ్రామా నుండి ఫస్ట్ సింగిల్ ని లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు

'మాయ గంగా.. మాయ గంగా.. మాయ చేసేనే.. మాట కూడా మౌనమయ్యే.. మాత్రమేదో ఇదే..' అంటూ సాగిన మెలోడీ గీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. అజనీష్ లోక్ నాథ్ కంపోజ్ చేసిన ఈ పాట మంత్రముగ్ధులను చేస్తోంది.

గేయ రచయిత కృష్ణ కాంత్ అర్థవంతమైన మంచి సాహిత్యం అందించగా.. యువ గాయకుడు అర్మాన్ మాలిక్ ఈ పాటను అద్భుతంగా పాడారు. ప్రేయసి తొలి ముద్దు అనుభూతిని ఆస్వాదిస్తున్న ప్రేమికుడు.. తనలోని భావాలను వ్యక్తపరిచే సందర్భంలో 'మాయ గంగ' పాటను రూపొందించారు.

ప్రధాన జంట మధ్య కెమిస్ట్రీ బాగుంది. వారణాసి బ్యాక్ డ్రాప్ లో విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ గా నిలుస్తుంది. కచ్చితంగా కొన్నాళ్లపాటు సంగీత ప్రియుల ప్లే లిస్టులో ఉంటుందని చెప్పొచ్చు.

''బనాసర్'' చిత్రాన్ని నేషనల్ ఖాన్స్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లో తిలక్ రాజ్ భల్లాల్ నిర్మిస్తున్నారు. ఇందులో నారాయణ రాజ్ - సుజయ్ శాస్త్రి - దేవరాజ్ - అచ్యుత్ కుమార్ - బర్కత్ అలీ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో 'బనాసర్' మూవీ విడుదల కాబోతోంది. కన్నడలో 'బెల్ బాటమ్' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన జయతీర్థ నుంచి రాబోతున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.