సుక్కును ముంబయికి రమ్మన్న అగ్రనటుడు.. సెట్ అయ్యేనా?

Sun Jan 16 2022 07:00:01 GMT+0530 (IST)

Sukumar Express Wish To Work With Akshay Kumar

ఒకప్పుడు తెలుగు సినిమా దక్షిణాది రాష్ట్రాలకు పరిమితమయ్యేది. పక్క రాష్ట్రాల్లో అతి కష్టమ్మీదా ఆడేది. ఈ మధ్యన ఆ సీన్ పూర్తిగా మారింది. రోటీన్ కు భిన్నమైన సినిమాలు చేయటం.. అందరిని ఆకర్షిస్తున్నాయి. బాహుబలి తర్వాత తెలుగు సినిమాను చూసే కోణం మారింది. ఈ మధ్యనే విడుదలై అందరిని ఆకర్షిస్తోంది పాన్ ఇండియా మూవీ 'ఫుష్ప'. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి వేళ.. ఈ సినిమా దర్శకుడు సుకుమార్ ఆసక్తికర విషయాల్ని రివీల్ చేశారు. ఆయన మాటల్ని వింటుంటే.. బాలీవుడ్ కు త్వరలో ఎంట్రీ ఇవ్వటం ఖాయమైనట్లుగా అనిపిస్తోంది.తానీ మధ్య ఒక సినిమా షూటింగ్ లో ఉండగా.. బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ తనకు ఫోన్ చేశాడని చెప్పారు.''ఆయన ఫోన్ చేసి ముంబయికి రా.. నీతోకలిసి పని చేయాలన్నాడు.. ఈ మధ్యనే ఇది జరిగింది. మంచి స్క్రిప్టు కుదిరితే తప్పకుండా ఆయనతో సినిమా చేస్తా'' అని వెల్లడించారు. పుష్ప మూవీని చూసిన అక్షయ్.. అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేయటం తెలిసిందే.

అయితే.. ఇక్కడో సందేహం రాక మానదు. భిన్నధ్రువాల మధ్య లింకు కుదురుతుందా? అన్నది ప్రశ్న. సుక్కు టేకింగ్.. అతడి సినిమాలు ఎంత నెమ్మదిగా సాగుతాయో తెలిసిందే. అందుకు భిన్నంగా అక్షయ్ కుమార్ మూవీలు యమా ఫాస్ట్ గా చాలా ప్లాన్డ్ గా పూర్తి చేస్తుంటారు. బాలీవుడ్ లో మరే అగ్రనటుడికి లేనంత పక్కా ప్లానింగ్ అక్షయ్ మూవీల్లో కనిపిస్తుంటుంది. మరి.. సుక్కు స్కూల్ కు అక్షయ్ వెళతారా? అక్షయ్ స్కూల్ కు తగ్గట్లు సుక్కు తనను తాను మార్చుకుంటారా? అన్నది అసలు ప్రశ్నగా చెప్పకతప్పదు.