టాలెంటెడ్ డైరెక్టర్ కు ఈసారైనా మంచి బ్రేక్ వస్తుందా..?

Tue Jan 18 2022 11:25:27 GMT+0530 (IST)

Sudheer Varma Hopes On Raviteja Movie

'స్వామిరారా' చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సుధీర్ వర్మ.. వైవిధ్యమైన కథలను తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్.. 'రణరంగం' ప్లాప్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలతో రాబోతున్నారు.సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా కాసాండ్రా - నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో ''శాకినీ ఢాకినీ'' అనే లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ కామెడీ సినిమా తెరకెక్కుతోంది. ఇది దక్షిణ కొరియా 'మిడ్ నైట్ రన్నర్స్' చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదే క్రమంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా ''రావణాసుర'' అనే సినిమాని రూపొందిస్తున్నారు సుధీర్ వర్మ. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఇటీవలే ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. నిన్న సోమవారం నుంచే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. రవితేజ రెండో షెడ్యూల్ నుంచి షూట్ లో జాయిన్ అవుతాడని సమాచారం.

'రావణాసుర' చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ మరియు ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్స్ అభిషేక్ నామా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. గతంలో అభిషేక్ పిక్చర్స్ సంస్థలో దర్శకుడు సుధీర్ వర్మ 'కేశవ' అనే సినిమా తీశాడు. అప్పట్లో ఈ సినిమా బాగానే ఆడింది.  దీని తరువాత సుధీర్ తీసిన సినిమాలేవే పెద్దగా ఆడలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండు సినిమాలతో వస్తున్నాడు.

అయితే ఇంతవరకు సుధీర్ కేవలం మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు తీశాడు. ఇప్పుడు తొలిసారిగా రవితేజ వంటి స్టార్ రేంజ్ మాస్ హీరోతో సినిమా రూపొందిస్తున్నారు. అందుకే ఈసారి తన ఫార్మాట్ నుంచి బయటికొచ్చి సుధీర్ ఈ సినిమా తీస్తున్నట్లుగా తెలిసింది. స్టైలిష్ టేకింగ్ కు పేరుగాంచిన యువ దర్శకుడు.. నావెల్ కాన్సెప్ట్ తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.

ఇందులో రవితేజ లాయర్ గా కనిపించనుండగా.. అక్కినేని హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించనున్నారు. అలానే ఈ సినిమాలో అనూ ఇమాన్యుల్ - పూజిత పొన్నాడ - ఫరియా అబ్దుల్లా - మేఘా ఆకాశ్ - దక్ష నగర్కార్ వంటి ఐదుగురు ముద్దుగుమ్మలు భాగం అవుతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ విస్సా అందించే పవర్ ఫుల్ స్టోరీతో రెడీ అవుతున్న 'రావణాసుర' సినిమా అటు సుధీర్ వర్మకు ఇటు నిర్మాత అభిషేక్ కి మంచి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.