Begin typing your search above and press return to search.

పోగాకు ఉత్ప‌త్తులు కోలాలకు స్టార్స్ బ‌హుదూరం

By:  Tupaki Desk   |   8 Feb 2023 10:02 AM
పోగాకు ఉత్ప‌త్తులు కోలాలకు స్టార్స్ బ‌హుదూరం
X
పాపుల‌ర్ స్టార్ల‌తో త‌మ ఉత్ప‌త్తుల‌కు హైప్ పెంచుకునే ప్ర‌చార వ్యూహాన్ని కొన్ని కార్పొరెట్ కంపెనీలు అనుస‌రిస్తాయి. భారీగా మార్కెట్ షేర్ ని కొల్ల‌గొట్టేందుకు టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో జ‌నాక‌ర్ష‌క శ‌క్తి ఉన్న తార‌ల‌తో భారీ కాంట్రాక్టులు కుదుర్చుకుని అటుపై త‌మ బ్రాండ్ల‌కు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌ను రూపొందించ‌డం రివాజు. త‌మ ఫేవ‌రెట్ల‌ను అనుక‌రించేందుకు అభిమానులు ప్ర‌జ‌లు ఎప్పుడూ సిద్ధం. ఇది కొన్ని ప్ర‌మాదాల‌కు కారణ‌మ‌వుతోంద‌ని కూడా విమ‌ర్శ‌లున్నాయి.

ఖైనీలు జ‌ర్ధాలు గుట్కాలు వంటి క్యాన్స‌ర్ కార‌క ఉత్ప‌త్తుల ప్ర‌చారానికి పూనుకునే స్టార్ల‌పైనా ఇప్ప‌టికే తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. కానీ ఇంకా వీటిలో కోలాలు.. పొగాకు ఉత్ప‌త్తులు..బ్రూవ‌రీస్ అండ్ వైన్స్ .. ఎన‌ర్జీ డ్రింక్స్.. ఇంకా ఎన్నో ఎన్నెన్నో ప్ర‌చారానికి నోచుకుంటున్నాయి. కోట్లాది రూపాయ‌ల కాంట్రాక్టుల‌ను కుదుర్చుకునేందుకు తార‌లు కొన్నిసార్లు ఇలాంటి వాటి ప్ర‌చారానికి ముందుకు వ‌స్తూ విలువ‌ల (ఎథిక్స్)ను వ‌దిలేస్తున్నార‌ని తీవ్ర విమ‌ర్శ‌లున్నాయి. ఇంత‌కుముందు ఎమీజాక్స‌న్.. ద‌గ్గుబాటి రానా లాంటి స్టార్లు జూదానికి ప్ర‌చారం చేసారు. కేస‌నోవా త‌ర‌హా జూదం ఆస్తుల‌ను హారతి కర్పూరంలా హ‌రిస్తుంద‌ని తెలిసినా వారు ఇలాంటి ప్ర‌చారానికి పూనుకున్నార‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. ఆ త‌ర్వాత రానా దాని నుంచి విర‌మించుకున్నారు. ఆ త‌ర్వాత అదే జూదం ఇప్పుడు సామాన్యుల‌తో ప్ర‌చారం చేసుకునే ఎత్తుగ‌డ‌ను అనుస‌రిస్తున్న వైనం వెబ్ లో బ‌య‌ట‌ప‌డుతోంది. విష‌యం అర్థం కాని టీనేజీ యువ‌త‌.. అమాయ‌క ప్ర‌జ‌లే వీటి ల‌క్ష్యం.

కోలాలు కోలా అనుస‌ర‌ణ ఉత్ప‌త్తుల్లో పురుగుమందుల అవ‌శేషాలు అధిక‌మ‌య్యాయ‌ని ఫుడ్ అండ్ డ్ర‌గ్ కంట్రోల్ అధికారులు చాలా కాలం క్రిత‌మే తేల్చారు. ఎక్కువ కాలం నిల్వ కోసం ఎక్కువ పురుగుమందులు ర‌సాయనాలు వాడుతున్నారు. ఆ త‌ర్వాత కోలాల్ని భార‌త‌దేశంలో బ‌హిష్క‌రించాల‌ని నినాదాలు వెల్లువెత్తాయి. కానీ కోలా కంపెనీలు ఇప్ప‌టికీ ప్ర‌ముఖ స్టార్ల‌ను హైర్ చేసుకుని వింత‌గా డ‌బ్బాట ఆడుతూ.. ప్ర‌జ‌ల ఆరోగ్యానికి హాని క‌లిగిస్తూనే ఉన్నాయ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

అయితే స్టార్ హీరోల్లో కొంద‌రు ఇలాంటి కార్పొరెట్ ఉత్ప‌త్తుల ప్ర‌చారానికి వ్య‌తిరేకం. వారి విలువ‌ను పెంచే లేదా మ‌న‌సుకు న‌చ్చే ఉత్ప‌త్తుల‌కు మాత్ర‌మే ప్ర‌చార‌క‌ర్త‌లుగా కొన‌సాగుతున్నారు. ఇక కోలా ఉత్ప‌త్తులు పొగాకు ఉత్ప‌త్తుల‌కు ప్ర‌చారం చేసేందుకు ఎప్పుడూ వెన‌కాడే స్టార్లు కొంద‌రు మ‌న‌కు ఉన్నారు. కోట్లాది రూపాయ‌ల డీల్స్ ని తృణ‌ప్రాయంగా విదిలించేసిన స్టార్లుగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - మెగాస్టార్ చిరంజీవి- ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్లు ప్ర‌ముఖంగా వినిపించాయి. ఈ త‌ర‌హా డీల్స్ అగ్ర తార‌లు ఇటీవ‌ల‌ చేయ‌డం లేదు.

ఇటీవ‌ల పూర్తిగా సినిమాల‌పైనే దృష్టి సారించిన చ‌ర‌ణ్ అద‌న‌పు ఆదాయ మార్గాల కోసం ఆశించ‌డం లేదు. కోలా ప్ర‌క‌ట‌న‌ల‌కు పొగాకు ఉత్ప‌త్తుల ప్ర‌క‌ట‌న‌ల‌కు చ‌ర‌ణ్ దూరంగా ఉన్నారు. తొలి నుంచి డార్లింగ్ ప్ర‌భాస్ వీట‌న్నిటికీ అతీతం. పాన్ ఇండియా స్టార్ గా త‌న‌కు వాణిజ్య ప్ర‌క‌ట‌నల్లో న‌టించే అవ‌కాశాలు వ‌చ్చినా త్య‌జించిన చరిత్ర ఉంది.

కేజీఎఫ్ య‌ష్ .. ఇంత‌కుముందు పొగాకు ఉత్ప‌త్తుల‌కు ప్ర‌చారం చేసేందుకు భారీ ఆఫ‌ర్ అందుకున్నాడు. కానీ ఇంత‌లోనే కోట్లాది రూపాయ‌ల డీల్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ప్ర‌జ‌ల‌కు హాని చేసే ఉత్ప‌త్తుల‌కు తాను ప్ర‌చారం చేయ‌బోన‌ని సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. ఒక సామాన్య బ‌స్ డ్రైవ‌ర్ కొడుకు య‌ష్‌ ఇప్పుడు దేశాన్ని ఏలే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయినా స‌మాజం ప‌ట్ల త‌న బాధ్య‌త‌ను బంధుమిత్రుల విష‌యంలో త‌న స‌ఖ్య‌త‌ను విడిచిపెట్టేందుకు ఏమాత్రం సిద్ధంగా లేడ‌ని య‌ష్ పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. విలువ‌లు వ‌దిలేసేందుకు కొంద‌రు అగ్ర తార‌లు సిద్ధంగా లేరు. అలాంటి వారంద‌రికీ ప్ర‌జ‌ల త‌ర‌పున ధ‌న్య‌వాదాలు. ముఖ్యంగా వారి భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌కు మంచిత‌నానికి శుభాభినంద‌న‌లు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.