'బృంద' వెబ్ సిరీస్ తో స్టార్ హీరోయిన్ ఓటీటీ అరంగేట్రం..!

Sat Oct 16 2021 05:00:01 GMT+0530 (IST)

Star heroine OTT debut with web series

డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా మొదలైన తర్వాత స్టార్ హీరోహీరోయిన్లు కూడా వెబ్ కంటెంట్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. కెరీర్ ముగింపు దశకి వచ్చిన ముదురు భామలకు ఓటీటీలు వరంగా మారాయి. భవిష్యత్తులో వెబ్ కంటెంట్ కు ఇలానే మంచి డిమాండ్ ఉంటుందనే ఆలోచనతో.. డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కే వెబ్ సిరీస్ లలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే ప్రియమణి - కాజల్ - తమన్నా - సమంత - నిత్యా మీనన్ వంటి బిజీ తారలు సైతం డిజిటల్ బాట పట్టారు. ఈ క్రమంలో ఇప్పుడు సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కూడా వెబ్ సిరీస్ లో నటించడానికి ఒప్పుకుందని తెలుస్తోంది.సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన త్రిష.. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ వరుస ఆఫర్స్ తో కుర్ర భామలకు పోటీగా నిలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో సత్తా చాటుతున్న ఈ బ్యూటీ.. తెలుగులో చివరగా 'నాయకి' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కనిపించింది. ఈ సినిమా ప్లాప్ అవడంతో మళ్ళీ తెలుగులో ఆఫర్స్ అందుకోలేకపోయింది. అయితే ఐదేళ్ల తర్వాత ఓ వెబ్ సిరీస్ ద్వారా మళ్ళీ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది త్రిష. తాజాగా ''బృంద'' అనే ఒరిజినల్ సిరీస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

''బృంద'' వెబ్ సిరీస్ తో త్రిష గ్రాండ్ గా డిజిటల్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవలే తెలుగు ఓటీటీ స్పేస్ లోకి ఎంటర్ అయిన సోనీ లివ్ డిజిటల్ వేదిక దీన్ని రూపొందిస్తోంది. ఇది సోనీ లివ్ యొక్క మొట్టమొదటి తెలుగు వెబ్ సిరీస్. కొత్త దర్శకుడు సూర్య వంగల దర్శకత్వం వహిస్తున్నారు. ఎనిమిది ఎపిసోడ్స్ గా రానున్న ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ లో సాయి కుమార్ - ఆమని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఈ వెబ్ సిరీస్ తో నిర్మాతగా మారుతున్నారు. దీనికి అవినాష్ ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా నిర్వహిస్తారు. ఈ సిరీస్ కు శక్తి కాంత్ కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. మరి 'బృంద' సిరీస్ త్రిష తో పాటు సోనీ లైవ్ కు తెలుగు ఓటీటీ స్పేస్ లో గ్రాండ్ ఎంట్రీ అవుతుందేమో చూడాలి.