Begin typing your search above and press return to search.

సీనియర్ స్టార్స్ కి ఫస్టు ఛాయిస్ గా శ్రుతి హాసన్!

By:  Tupaki Desk   |   9 March 2022 11:30 AM GMT
సీనియర్ స్టార్స్ కి ఫస్టు ఛాయిస్ గా శ్రుతి హాసన్!
X
హీరోయిన్స్ క్రేజ్ వాళ్ల గ్లామర్ తో ముడిపడి ఉంటుంది. గ్లామర్ తో పాటే అవకాశాలు .. వాటితో పాటే క్రేజ్ తగ్గుతూ పోతాయి. అందువల్లనే సాధ్యమైనంత త్వరగా వీలైనన్ని భాషల్లో సినిమాలను చుట్టబెట్టేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ తరువాత పెళ్లి .. పిల్లల కారణంగా వాళ్ల కెరియర్ కి బ్రేక్ వస్తుంటుంది. గ్యాప్ తరువాత వాళ్లకి మళ్లీ హీరోయిన్స్ గా అవకాశాలు రావడం దాదాపుగా అసాధ్యం. అదే హీరోల విషయానికి వస్తే వాళ్ల కెరియర్ గ్రాఫ్ ఎక్కువగా ఉంటుంది. స్టార్ హీరోల గ్రాఫ్ అంత తొందరగా పడిపోదు. వాళ్ల జోరు అదే ఊపుతో కొనసాగుతూ ఉంటుంది.

ఈ కారణంగానే సీనియర్ స్టార్ హీరోల సరసన కథానాయికలు దొరకడం కష్టమవుతోంది. గతంలో సీనియర్ స్టార్ హీరోల జోడీగా కనిపించడం కుర్ర హీరోయిన్లు ఒక ప్రమోషన్ గా భావిస్తూ ఉండేవారు. కానీ ఇప్పటి కుర్ర భామలు ఆ తరువాత తమకి యంగ్ హీరోల జోడీగా అవకాశాలు రావేమోనని టెన్షన్ పడుతున్నారు. అంతేకాదు సీనియర్ హీరోల సరసన కుర్ర హీరోయిన్లను చూడటానికి ఇప్పటి ఆడియన్స్ కూడా ఇష్టపడటం లేదు. అలాగని చెప్పేసి అంతగా క్రేజ్ లేని హీరోయిన్లను .. అవకాశాలు లేని హీరోయిన్లను తీసుకుందామంటే ఆడియన్స్ ఒప్పుకోవడం లేదు.

ఈ కారణంగా తెలుగులో చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేశ్ .. నాగార్జున వంటి సీనియర్ హీరోలకు హీరోయిన్స్ ను సెట్ చేయడం దర్శక నిర్మాతలకు తలకి మించిన భారంగా మారింది. అనుష్క సినిమాల సంఖ్యను తగ్గించడం .. కాజల్ పెళ్లి తరువాత సినిమాలకు దూరం కావడం .. త్రిష తెలుగు వైపే చూడకపోవడం .. శ్రియను పట్టించుకునే పరిస్థితి లేకపోవడం .. నయనతార తమిళ సినిమాలతో సతమతమవుతుండటంతో ఇక తమన్నతోనే నెట్టుకొస్తున్నారు. 'అఖండ'లో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రగ్యాను తీసుకున్నారుగానీ .. ఆ వైపు నుంచి పడిన మార్కులు తక్కువే.

ఈ నేపథ్యంలోనే టాలీవుడ్లో సీనియర్ స్టార్ హీరోల ఫస్టు ఛాయిస్ గా శ్రుతి హాసన్ మారింది. రవితేజ సరసన నాయికగా 'క్రాక్' .. పవన్ సరసన 'వకీల్ సాబ్' చేసిన ఆమె, ప్రస్తుతం 'సలార్' సినిమాతో బిజీగా ఉంది. అలాంటి ఆమె బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమా చేయడానికి అంగీకరించింది. ఆల్రెడీ ఈ సినిమా షూటింగు మొదలైపోయింది కూడా. ఇక బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేయనున్న సినిమా కోసం కూడా ఆమెనే తీసుకున్నారు. నిన్ననే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

గ్లామర్ పరంగా .. క్రేజ్ పరంగా .. డాన్సుల పరంగా శ్రుతి హాసన్ ఎంపిక పట్ల అభ్యంతరాలు చెప్పే ఆడియన్స్ ఉండరు కనుక, ఆమె చెలరేగిపోవడానికి ఇంతకుమించిన అవకాశం ఉండదనే చెప్పాలి.