నటి జమునకు తలకొరివి పెట్టిన కూతురు

Fri Jan 27 2023 17:47:57 GMT+0530 (India Standard Time)

Sravanthi daughter at Actress Jamuna funeral

అలనాటి అందాల నటి జమున (86) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. తెలుగుతో పాటు తమిళం కన్నడ హిందీ భాషలలో ఆమె నటించారు. అలనాటి స్టార్ హీరోలకు ధీటుగా తనదైన మార్కు నటనతో ఆకట్టుకున్న జమున మృతి పట్ల పలువురు ఇండస్ట్రీ వర్గాలు పలువురు రాజకీయ నేతలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. జమున మృతితో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.నటి జమున అంత్యక్రియలు హైదరాబాద్ లో అంత్యక్రియలు పూర్తయ్యాయి. జమున కుమార్తె స్రవంతి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ సంప్రదాయాలను అనుసరిస్తూ జమున పార్థీవ దేహానికి ఆమె కూతురు స్రవంశీ దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులు బందువులతో పాటు పలువురు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. జమునకు కొడుకు కూడా వున్నాడు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో వున్నాడు.  

ప్రస్తుతం విదేశాల్లో వున్న జమున తనయుడు హైదరాబాద్ రావడానికి సమయం పడుతుందని తెలియడంతో కూతురే అంత్యక్రియలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా వుంటే జమున 1936లో ఆగస్టు 30న హంపీలో జన్మించారు. ఆమె తండ్రిగారి పేరు నిప్పణి శ్రీనివాసరావు. తల్లి కౌసల్యాదేవి. సినిమాల్లోకి ప్రవేశించడానికి ముందు జమున అసలు పేరు జానాభాయి. జ్యోతిష్యుల సూచనతో ఆమె పేరుని తల్లిదండ్రులు జమునగా మార్చేశారు.

గుంటూరులోని దుగ్గిరాల పాఠశాలలో ఆమె చదువుకున్నారు. తల్లి వద్దే గాత్ర సంగీతం హార్మోనియం నేర్చుకున్నారు. `ఖిల్జీరాజు పతనం` అనే నాటకం కోసం సీనియర్ నటులు జగ్గయ్య .. జమునను ఎంపిక చేసుకున్నారు. అలా నటనకు బీజం పడింది. `మా భూమి` నాటకం చూసిన గరికపాటి రాజారావు తనకు మొదటి సారి సినిమా అవకాశం ఇచ్చారు. అలా జమున 1952లో `పుట్టిల్లు` సినిమాతో సినీనటిగా మారారు. గడుసైన పాత్రలు ముఖ్యంగా సత్యభామ తరహా పాత్రలకు జమున అప్పట్లో కెరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఎన్టీఆర్ ఏ ఎన్నార్ వంటి దిగ్గజ నటులతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.