Begin typing your search above and press return to search.

'ఆచార్య' లో సోనూసూద్ లుక్: రియల్ హీరోకి చిరు స్పెషల్ బర్త్ డే విషెస్..!

By:  Tupaki Desk   |   30 July 2021 3:33 PM GMT
ఆచార్య లో సోనూసూద్ లుక్: రియల్ హీరోకి చిరు స్పెషల్ బర్త్ డే విషెస్..!
X
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ''ఆచార్య''. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధర్మస్థలి అనే ఊరి నేపథ్యంలో సందేశాత్మక అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిరంజీవి - చరణ్ నక్సలైట్లుగా కనిపిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ - పూజాహెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.

నేడు (జులై 30) సోనూసూద్‌ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. 'ఆచార్య' చిత్రంలో ఆయన ఫస్ట్ లుక్‌ ని చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. ఇందులో నుదుట బొట్టు పెట్టుకుని, మెడలో రుద్రాక్ష మాల ధరించిన సోనూ.. పిల‌క‌తో డిఫరెంట్‌ లుక్‌ లో కనిపించారు. తెలుగు విలన్ పాత్రలతో పాపులర్ అయిన సోనూసూద్.. 'ఆచార్య' లో కూడా నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన సోనూసూద్‌ ఆచార్య లుక్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇకపోతే సోనూసూద్ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు చేతనైనంత సాయం చేసి ఎంతోమందికి ప్రత్యక్ష దైవంగా మారాడు. దేశవ్యాప్తంగా అంతులేని సేవా కార్యక్రమాలతో రియల్ హీరో అనిపించుకున్నాడు. నేడు సోనూ పుట్టిన రోజు కావడంతో సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ రాజకీయ ప్రముఖుల దగ్గర నుండి.. సామాన్యుల వరకు అందరూ బర్త్‌ డే విషెస్‌ అందిస్తున్నారు. ఈ క్రమంలో 'ఆచార్య' లో తనతో కలసి నటించిన సోనూ సూద్ కు మెగాస్టార్ చిరంజీవి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.

చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ''ప్రియమైన సోనూసూద్‌.. మీరు నిజమైన జీవితాన్ని గడుపుతున్నారు. కష్టాల్లో ఉన్న పేదవారికి సహాయం చేయడం కంటే గొప్ప సంతృప్తి మరొకటి ఉండదు. మీ జీవితం ఎల్లప్పుడూ దయ మరియు సంతృప్తితో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌ డే సోనూసూద్‌. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే'' అని పేర్కొన్నారు.