Begin typing your search above and press return to search.

'సన్ ఆఫ్ ఇండియా' టీజర్: ఆయన కసక్ అంటే అందరూ ఫసక్..!

By:  Tupaki Desk   |   4 Jun 2021 7:30 AM GMT
సన్ ఆఫ్ ఇండియా టీజర్: ఆయన కసక్ అంటే అందరూ ఫసక్..!
X
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు చాలా గ్యాప్ తర్వాత ఫుల్ లెంత్ రోల్ లో నటిస్తున్న సినిమా ''సన్ ఆఫ్ ఇండియా''. డైమండ్ ర‌త్న‌బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మోహ‌న్‌ బాబు స్క్రీన్‌ ప్లే స‌మ‌కూరుస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ - శ్రీ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ పతాకాలపై మంచు విష్ణు ఈ మూవీని నిర్మిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు మంచి రెస్పాన్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'సన్ ఆఫ్ ఇండియా' టీజర్ ను కోలీవుడ్ స్టార్ హీరో సూర్య విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు.

'మన అంచనాలకు అందని ఓ వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను' అంటూ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ప్రారభమైంది. 'తన రూటే సపరేటు.. తను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో.. ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో.. ఆ దేవుడికే ఎరుక' అంటూ ఇందులో మోహన్ బాబు పాత్ర స్వభావాన్ని తెలియజేసారు. ఈ సినిమాలో డైలాగ్ కింగ్ విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నాడు. అంతేకాదు ఆయన పాత్ర చాలా ప‌వ‌ర్‌ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. అంతేకాదు ఒకప్పటి మోహన్ బాబును గుర్తు చేస్తున్నారు.

ఈ టీజర్ లో 'నేను చీకటిలో ఉండే వెలుతురుని.. వెలుతురులో ఉండే చీకటిని' అంటూ విలక్షణ నటుడు తనదైన శైలిలో చెప్పే డైలాగ్ అలరిస్తోంది. ఇక సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన 'ఓన్లీ వన్స్ ఫసక్' మాదిరిగా చివర్లో 'నేను కసక్ అంటే మీరందరూ ఫసక్' అని మోహన్ బాబు చెప్పడం గమనార్హం. ఇందులో శ్రీకాంత్ - ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తనికెళ్ళ భరణి - ఆలీ - వెన్నెల కిషోర్ - పృథ్వీరాజ్ - రాజా రవీంద్ర - రఘుబాబు - రవి ప్రకాష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

'సన్ ఆఫ్ ఇండియా' చిత్రానికి మేస్ట్రో ఇళ‌య‌రాజా సంగీత స్వ‌రాలు సమకూరుస్తున్నారు. స‌ర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. గౌతమ్ రాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇందులో మోహ‌న్‌ బాబుకు స్టైలిస్ట్‌ గా ఆయ‌న కోడ‌లు విరానికా మంచు వర్క్ చేస్తున్నారు. ఎన్నో విలక్షణమైన పాత్రలతో మెప్పించిన మోహన్ బాబు నటించిన 'సన్నాఫ్ ఇండియా' సినిమాకి సంబంధించిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.