టికెట్ ధరల సమస్య పరిష్కారం కోసం ఎదురుచూపులు తప్పవా..?

Fri Jan 28 2022 21:00:01 GMT+0530 (IST)

Solution of the ticket price problem

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని ఇండస్ట్రీ మొత్తం వేచి చూస్తోంది. ఓవైపు ఈ అంశం మీద కోర్టులో విచారణ జరుగుతుండగా.. మరోవైపు ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక రెడీ చేయడానికి సమావేశాలు జరుపుతోంది.ఇకపోతే రెండు వారాల క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి అమరావతిలోని సీఎం నివాసంలో భేటీ అయిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ ధరలు - చిత్ర పరిశ్రమలోని ఇతర సమస్యలపై చర్చించినట్లు చిరు తెలిపారు.

వైఎస్ జగన్ తో సమావేశం భరోసా కల్పించిందని.. మరో వారం పది రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన కొత్త జీవో వస్తుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని చిత్ర పరిశ్రమలో అందరూ భావించారు..

అయితే ఇంతవరకు ఏపీ సర్కారు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రభుత్వ కమిటీ రెండుసార్లు సమావేశాలు నిర్వహించినా ప్రస్తుతానికైతే పెద్ద పరిణామాలు లేవు. ఫిబ్రవరి 10న టికెట్ రేట్ల అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తదుపరి విచారణ జరగనుంది. ఏపీ హైకోర్టులో ప్రభుత్వ కమిటీ కౌంటర్ దాఖలు చేయనుంది.

ఈ నేపథ్యంలో సినిమా టిక్కెట్ ధరల అంశంపై అమరావతిలో ఫిబ్రవరి 2వ మరోసారి సమావేశం కానున్నారని సమాచారం. ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లుతో పాటు ప్రేక్షుకుల సంఘం సభ్యుల అభిప్రాయాలను అధికారులు తెలుసుకోనున్నారు.

టిక్కెట్ రేట్ల వ్యవహారం మరికొన్ని రోజులు ఇలానే కొనసాగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పరిస్థితులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ తీసుకురాబోతున్నట్లు చెప్పిన సినిమా టికెట్ ధరల ఆన్ లైన్ పోర్టల్ వచ్చే వరకు ఈ సమస్యను మరింత ముందుకు తీసుకెళ్తారేమో అనే సందేహాలు వస్తున్నాయి.

ఇదే జరిగితే టికెట్ ధరల సమస్య పరిష్కారం కోసం టాలీవుడ్ మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి తెలుగులో పెద్ద సినిమాల విడుదలలు లేవు. కరోనా ప్రభావం లేకపోతే ఫిబ్రవరి నాలుగో వారం నుంచి సినిమాల రిలీజులు ప్లాన్ చేసే అవకాశం ఉంది. మరి ఆలోపు ఏపీలో టికెట్ ధరల పరిష్కారం - నైట్ కర్ఫ్యూ సడలింపులు జరుగుతాయేమో చూడాలి.