సంక్రాంతి పండక్కి పాలు పొంగించిన హీరో

Fri Jan 14 2022 23:13:15 GMT+0530 (India Standard Time)

Siva Karthikeyan With His Family

సంక్రాంతి పండగకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత ఉంది. తెలుగు రాష్ట్రాలకు ఇది ఎంతో ప్రత్యేకమైనది కాగా తమిళనాడు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఈ పండగను సంబరంగానే జరుపుకుంటున్నారు. పొరుగున అంటే తమిళ తంబీలు ఈ వేడుకల్ని ఎలా జరుపుకుంటున్నారు? అంటే దానికి సమాధానంగా .. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ యాక్ట్ ని పరిశీలించాల్సిందే.పండగ వేళ పంచె కట్టుతో ఎంతో సాంప్రదాయబద్ధంగా తన కుటుంబాన్ని తెలుగు వారికి పరిచయం చేశాడు. తన కుటుంబంతో పాటు తన పొంగల్ వేడుకల నుండి కొన్ని ఫోటోల్ని పంచుకున్నాడు. నటుడు సాంప్రదాయ పంచె కట్టులో స్మైలీ లుక్ తో అద్భుతంగా కనిపించాడు. అతను తన కొత్త ఇంటి ముందు మంటపై ఉంచిన పొంగల్ కుండ ముందు పోజులిచ్చాడు. SK కుండలో నుండి అన్నం -పాలు పొంగిపొర్లడాన్ని చూస్తున్నారు. ఇది మంచి సంకేతంగా భవిష్యత్తు శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోగ్రాఫ్స్ లో అందమైన కుటుంబం కనిపించింది. వీటిలో శివకార్తికేయన్ తన నవజాత కుమారుడు గుగన్ దాస్ తో మ్యాచింగ్ దుస్తులను తొడుక్కుని కనిపించాడు. మరొక చిత్రంలో అందమైన కుటుంబం SK అతని భార్య ఆర్తి దాస్- కుమార్తె ఆరాధన కనిపించారు. పువ్వులు- చెరకు దొంతరలు .. రంగోలితో రెప్పపాటులో కొంత పండుగ వైభవాన్ని తీసుకురావడానికి ఇంటిని అందంగా అలంకరించారు.

కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ ఈ సంవత్సరం తన టాలీవుడ్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP- సురేష్ ప్రొడక్షన్స్ -శాంతి టాకీస్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్- పుస్కుర్ రామ్ మోహన్ రావు -సురేష్ బాబు సంయుక్తంగా శివకార్తికేయన్ తో ద్విభాషా చిత్రం SK20 ని నిర్మిస్తున్నారు. తెలుగులో డెబ్యూ మూవీ చేస్తున్నందున ఎస్ కేకి ఈ సంవత్సరం కూడా చాలా ముఖ్యమైనది. ఈ చిత్రానికి జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ -అయాలాన్ తదితరులు నటిస్తున్నారు. శివకార్తికేయన్ లిరిసిస్టుగానూ పని చేస్తున్నారు. సూర్య తదుపరి చిత్రం ఎతర్క్కుం తునింధవన్ కి సాహిత్యం కూడా రాశారు. ఈ మూవీ ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. శివకార్తికేయన్ సాహిత్యం అందించిన ఈ చిత్రం నుండి తదుపరి సింగిల్ సుమ్మా సుర్రును జనవరి 16న విడుదల కానుంది. ఇది సూర్యతో అతని తొలి కలయిక కాబట్టి అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.