Begin typing your search above and press return to search.

ఏపీ సీఎంకి సిరివెన్నెల కుటుంబం కృతజ్ఞత‌లు

By:  Tupaki Desk   |   1 Dec 2021 2:30 PM GMT
ఏపీ సీఎంకి సిరివెన్నెల కుటుంబం కృతజ్ఞత‌లు
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డికి సిరివెన్నెల కుటుంబం కృతజ్ఞతాభివందనాలు తెలియ‌జేసింది. 30నవంబ‌ర్ ఉదయం 10 గంటలకు కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న మాకు గౌ.ముఖ్యమంత్రి కార్యాలయం నుండి శాస్త్రిగారి ఆరోగ్య పరిస్థితులపై ఎంక్వయిరీ చేస్తూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆసుపత్రి ఖర్చులన్ని ప్ర‌భుత్వ‌మే భ‌రించేలా ఆదేశించినట్లుగా తెలియజేశారు. సిరివెన్నెల సాయంత్రం 4.07 గంటలకు స్వర్గస్తుల‌య్యారు. అనంత‌రం గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తమ సంతాపాన్ని తెలియజేశారు.

శాస్త్రిగారి అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రివర్యులు హాజరై ఆసుపత్రి ఖర్చులన్నీ భరిస్తూ.. మేము కట్టిన అడ్వాన్స్ ని కూడా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయని తెలియజేశారు. సిరివెన్నెలగారి పట్ల ఇంత ప్రేమానురాగాలు చూపించి మా కుటుంబానికి అండగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ జగన్ మోహన్ రెడ్డిగారికి మా కుటుంబమంతా కృతజ్ఞతలు తెలియజేస్తోంది... అని సిరివెన్నెల వార‌సుడు సాయి యోగేశ్వ‌ర్ తెలిపారు.

జూబ్లీహిల్స్ మ‌హా ప్ర‌స్థానంలో నేడు సిరివెన్నెల‌ అంత్య‌క్రియ‌లు పూర్త‌య్యాయి. నేటి ఉద‌యం భౌతిక ఖాయాన్ని సిరివెన్నెల ఇంటి నుంచి ఫిలింఛాంబ‌ర్ కి త‌ర‌లించారు. అక్క‌డ వేలాదిగా అభిమానులు ఆయన క‌డ‌చూపు కోసం త‌పించారు. సినీరాజ‌కీయ నాయ‌కులు సిరివెన్నెల పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. చాలామంది సిరివెన్నెల‌తో అనుబంధాన్ని నెమ‌రు వేసుకున్నారు. అనంత‌రం మ‌హా ప్ర‌స్థానానికి యాత్ర కొన‌సాగింది. పెద్ద కుమారుడు సాయి వెంక‌ట యోగేశ్వ‌ర శ‌ర్మ నిప్పంటించారు. ఆయ‌న అంతిమ‌యాత్ర అలా ముగిసింది.

గేయ ర‌చ‌యిత‌ సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి ఏపీ సమాచార- పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని నివాళుల‌ర్పించారు. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప ర‌చ‌యిత‌ సిరివెన్నెల అని మంత్రివ‌ర్యులు పేర్కొన్నారు. ఏపీ ప్రజల తరపున సిరివెన్నెల కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిరివెన్నెల కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఫిలిం ఛాంబ‌ర్ వ‌ద్ద సినీరాజ‌కీయ ప్ర‌ముఖులు సిరివెన్నెల‌తో అనుబంధాన్ని స్మ‌రించుకున్నారు.