'పక్కా కమర్షియల్' లో సిరివెన్నెల రాసిన ఆఖరి స్ఫూర్తిదాయక గీతం..!

Fri Jan 28 2022 22:00:01 GMT+0530 (India Standard Time)

Sirivennala Song In Pakka Commercial Movie

మ్యాచో స్టార్ గోపీచంద్ - బబ్లీ బ్యూటీ రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ''పక్కా కమర్షియల్''. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా.. టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటకు దివంగత లెజండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించడం విశేషం.సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి ఎన్నో స్ఫూర్తి దాయకమైన తెలుగు పాటలు జాలువారాయి. పది మందిని ప్రభావితం చేసే పాట రాయాలంటే సిరివెన్నెలకి మించిన ఆప్షన్ మరొకటి లేదని ఫిలిం మేకర్స్ భావిస్తుంటారు. ఆయన కెరీర్లో అలాంటి ఎన్నో అద్భుతమైన ప్రభావవంతమైన పాటలు తెలుగు కళామతల్లికి ప్రేక్షకులకు అందించారు. అలాంటి లెజెండరీ రైటర్ కలం నుంచి చివరిసారిగా జాలువారిన స్ఫూర్తిదాయక గీతం ''పక్కా కమర్షియల్'' సినిమాలో ఉంది.

'జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు' అంటూ సీతారామశాస్త్రి అందమైన పాట రాశారు. సిరివెన్నెల రాసిన చిట్టచివరి స్ఫూర్తిదాయక గీతం ఇదే కావడం గమనార్హం. జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు సంబంధించిన గ్లిమ్స్ ను జనవరి 31న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదే క్రమంలో ఫిబ్రవరి 2వ తేదీన పక్కా కమర్షియల్ పూర్తి పాట ప్రేక్షకుల ముందుకు రానుంది.

'పక్కా కమర్షియల్' కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి చివరిసారి రాసిన ఈ పాటలోని లిరిక్స్ తలుచుకొని దర్శకుడు మారుతి ఎమోషనల్ అయ్యారు. జీవిత సారాంశం వివరించేలా.. మరణం గురించి ముందే తెలిసినట్టు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారంటూ సిరివెన్నెలను గుర్తు చేసుకున్నారు మారుతి. ఈ పాటలో ఇంకా ఎన్నో అద్భుతమైన పదాలు వున్నాయని.. జీవితం గురించి పుట్టుక చావు గురించి అద్భుతమైన సాహిత్యం ఈ టైటిల్ సాంగ్ లో ఉందని దర్శకుడు చెప్పారు.