Begin typing your search above and press return to search.

ఆ మూడు పాటలే ఘంటసాల గారి ప్రాణాలు తీశాయేమో!

By:  Tupaki Desk   |   25 Sep 2022 9:33 AM GMT
ఆ మూడు పాటలే ఘంటసాల గారి ప్రాణాలు తీశాయేమో!
X
ఘంటసాల .. ఒక్క రోజులో చదివే పుస్తకం కాదు .. ఒక్క గంటలో పూర్తి చేసే అధ్యాయం కాదు. ఆయన పేరు ఒక చరిత్ర .. ఆయన స్వరం ఒక చరిత్ర. తెలుగు సినిమా చరిత్రను ఎన్టీఆర్ - ఏఎన్నార్ పేర్లు లేకుండా ఎలా చెప్పుకోలేమో, ఘంటసావారి పేరు లేకుండగా కూడా అలాగే చెప్పుకోలేం. తెలుగు పాటకు తేనె కంటే ఎక్కువ రుచిని చూపించినవారాయన. అలాంటి ఆయన శతజయంతి సంవత్సరం ఇది. ఈ సందర్భంగా ఆయనకి 'భారతరత్న' ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఘంటసాల గురించిన కొన్ని విషయాలను ఆయన కూతురు శ్యామల అభిమానులతో పంచుకున్నారు.

"నాన్నగారు 'శ్యామలాదేవి దండకం' పాడిన రెండు రోజులకు నేను పుట్టానట .. అందువలన ఆయన నాకు 'శ్యామల' అనే పేరు పెట్టారు. నాన్నగారి జయంతి డిసెంబర్ 4వ తేదీన. ప్రతి ఏడాది కూడా ఆ రోజున వివిధ ప్రాంతాల్లో అభిమానులు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలా ఈ సారి 100 ప్రాంతాల్లో 100 వేడుకలను నిర్వహించి 'గిన్నీస్ బుక్'వారి దృష్టికి తీసుకుని వెళ్లాలని అనుకుంటున్నాము. ఇది అన్నయ్య చేతుల మీదుగా జరగవలసిన పని .. ఆయన లేరు గనుక వదిన ఆ బాధ్యతను తీసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో నాన్నగారి విగ్రహాలు 48 వరకూ ఉన్నాయి. నాన్నగారికి మూడు గుళ్లు ఉన్నాయి .. వాటిలో ఆయనకి నిత్య పూజలు జరుగుతున్నాయి .. ఒక రకంగా ఇదీ రికార్డే. నాన్నగారితో నేను ఎక్కువగా ఎన్టీఆర్ గారినీ .. ఎస్వీఆర్ గారినీ .. రేలంగి గారిని చూశాను. వాళ్లంతా ఎంతో ఆత్మీయంగా మాట్లాకుంటూ కనిపించేవారు. మా ఇంట్లో తెలియకుండా ఎన్టీఆర్ ఇంట్లో .. వాళ్లకి తెలియకుండా మా ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలు జరిగేవి కాదు. ఒకానొక సమయంలో తెలుగు పాటల్లో సాహిత్య విలువలు పడిపోవడంతో, ఇక అలాంటి పాటలు పాడకూడదని నాన్నగారు నిర్ణయించుకున్నారు.

నాన్నగారు వాడిన ఒక నాటుమందు కారణంగా ఆయన గొంతులో పుండు పడింది. ఇకపై పాటలు పాడకూడదని డాక్టర్లు చెప్పారు. కానీ ఒక్క పాట పాడితే తమ సినిమా పూర్తవుతుందని నిర్మాతలు చెప్పుకోవడంతో, నాన్నగారు ఆ పాటలు పాడేశారు. హాస్పిటల్ బయట గేటు దగ్గర మేము మనుషులను పెడితే, వెనుక గేటు ద్వారా ఆయనను తీసుకుని వెళ్లి పాడించి .. తిరిగి కార్లో దిగబెట్టేసి వెళ్లిపోయేవారు. ఇది తెలిసి వెనుక గేటు దగ్గర కూడా మనుషులను పెట్టాము. అప్పటికే ఆయన మూడు పాటలు పాడేశారు. ఆ మూడు పాటలు పడటం వలన ఆయన మరింత ఇబ్బంది పడ్డారు. హార్ట్ ఎటాక్ రావడంతో చనిపోయారు' అంటూ చెప్పుకొచ్చారు.