సైనా బయోపిక్ స్కిప్ కొట్టడానికి కారణం?

Thu Sep 12 2019 07:00:01 GMT+0530 (IST)

Shraddha Kapoor has no regrets on walking out of Saina Nehwal biopic

హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటించే అవకాశం `సాహో` శ్రద్ధాని వరించిన సంగతి తెలిసిందే. సాహో కంటే ముందే ఆ సినిమాకి సంతకం చేసింది. ఏడాది పాటు షటిల్ బ్యాట్.. రాకెట్ పట్టుకుని ప్రిపరేషన్ సాగించింది. కానీ వన్ ఫైన్ డే అనూహ్యంగా ఆ ప్రాజెక్టు నుంచి శ్రద్ధాని తప్పించి పరిణీతిని ఎంపిక చేసుకున్నారని వార్తలొచ్చాయి. శ్రద్ధా సరిగా కోఆపరేట్ చేయకపోవడం వల్లనే దర్శకుడు అమోల్ గుప్తా సీరియస్ అయ్యి తనని తొలగించారని ప్రచారమైంది. అయితే అది నిజమా? అసలు అందులో వాస్తవం ఏమిటి? అని ప్రశ్నిస్తే.. శ్రద్ధా స్వయంగా ఆన్సర్ ఇచ్చింది.ఒకేసారి రెండు సినిమాలకు కాల్షీట్లు కేటాయించడం అంటే కుదిరే పనేనా? ఆ రెండింట్లో ఏదో ఒకటే ఎంపిక చేసుకోవాల్సి వస్తే ఏం చేయాలి?  పైగా తనకు ఎంతో నేర్పించిన గురువు(రెమో)గారు ఇచ్చిన ఆఫర్ వదులుకోవాలా? పైగా అది సీక్వెల్ సినిమా. దానిని కాదనుకుంటే అన్యాయం చేసినట్టే. ఒకవేళ అవును అనుకుంటే.. వేరొకటి వదులుకోవాల్సిందే! అంటూ స్పష్టంగా చెప్పింది శ్రద్ధా కపూర్. గురూజీ రెమో డి.సౌజా తెరకెక్కిస్తున్న `స్ట్రీట్ డ్యాన్సర్ 3డి` కోసం సైనా బయోపిక్ ని వదులుకోవాల్సి వచ్చిందని... అయితే తనకోసం ఆ బయోపిక్ దర్శకుడిని వెయిట్ చేయించడం ఇష్టం లేకే ఆ పని చేయాల్సొచ్చిందని వివరణ ఇచ్చింది.

ఎట్టకేలకు దీంతో శ్రద్ధా ఫ్యాన్స్ కు దీనిపై పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. ఇటీవలే చిచ్చోరే చిత్రంతో విజయం అందుకున్న శ్రద్ధా `సాహో` రూపంలో మరో బ్లాక్ బస్టర్ (హిందీలో) ని ఖాతాలో వేసుకుంది. ఆ వెంటనే తన ఫేవరెట్ మూవీ `స్ట్రీట్ డ్యాన్సర్ 3డి`తో బిజీ అయ్యింది. ఈ చిత్రం 2020 జనవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వరుణ్ ధావన్ ఇందులో కథానాయకుడు.

2018 మొదలు ఇప్పటివరకూ క్షణం తీరిక లేకుండా నటిస్తూనే ఉంది శ్రద్ధా కపూర్. ఏడాదికి నాలుగైదు సినిమాల్లో నటించేస్తూ ఊపిరి సలపనంత బిజీగా ఉంది. ఇంత బిజీలోనూ ఏనాడూ వృత్తిపరమైన చిక్కులేవీ రాకుండా జాగ్రత్త పడింది. అప్పట్లో డెంగ్యూ జ్వరం రావడం వల్ల చాలాకాలం సైనా బయోపిక్ ని వాయిదా వేయాల్సి వచ్చింది. దానివల్ల తనకు చెప్పకుండానే ఆ చిత్ర దర్శకుడు అమోల్ తీసుకున్న నిర్ణయాన్ని స్వగతించానని తెలిపింది. శ్రద్ధాని పక్కన పెట్టి పరిణీతిని ఎంపిక చేసుకున్నారు అన్న ప్రచారం సాగడంతో ఇన్నాళ్లకు ఇలా క్లారిటీ ఇచ్చేసిందన్నమాట.