Begin typing your search above and press return to search.

రోజూ తాగే మ‌ద్యం ధ‌ర‌లు పెంచొచ్చు... ఎప్పుడో చూసే సినిమా రేటు పెంచ‌కూడ‌దా?

By:  Tupaki Desk   |   25 Nov 2021 10:30 AM GMT
రోజూ తాగే మ‌ద్యం ధ‌ర‌లు పెంచొచ్చు... ఎప్పుడో చూసే సినిమా రేటు పెంచ‌కూడ‌దా?
X
ఏపీ ప్ర‌బుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అంద‌రూ ఆశ్చ‌ర్యంగా కూడా చ‌ర్చించుకుంటున్నారు. ఎందుకంటే.. తాను నిర్ణ‌యించిందే వేదం అన్న‌ట్టుగా.. ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించ డంపై.. అంద‌రూ విస్మ‌యం పొతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం కొలువు దీరిన త‌ర్వాత‌.. అనూహ్య‌మైన అంశాలు తెర‌మీదికి వ‌చ్చాయి. ముఖ్యంగా మ‌ద్యం ధ‌ర‌ల‌ను విప‌రీతంగా పెంచారు. మెయిన్ బ్రాండ్ల‌ను.. ప్రీమియ్ బ్రాండ్ల‌ను కూడా ప‌క్క‌న పెట్టారు. అదేస‌మ‌యంలో ఎందుకూ ప‌నికిరాని.. ప్ర‌జారోగ్యంతో చెల‌గాట‌మాడే బ్రాండ్ల‌ను ప్ర‌వేశ పెట్టారు. వీటి ధ‌ర‌ల‌ను ఆకాశానికి పెంచేశారు.

రూ. 50-70 మ‌ధ్య ప‌లికే బ్రాండ్ల‌ను రూ.200 చేశారు. నిజానికి మ‌న రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ కాయ‌క‌ష్టం చేసుకునే జీవులే ఉన్నారు. ఉద‌యం నుంచి ప‌నిచేసి.. అలిసిపోయిన శ‌రీరానికి ఒకింత రిలీఫ్ ఇచ్చేందుకు సాయంత్రం అవ‌గానే.. మ‌ద్యం తీసుకోవ‌డం.. కామ‌న్‌. అయితే.. ప్ర‌భుత్వం మాత్రం వీరి వీక్ నెస్‌ను ఆధారంగా చేసుకుని.. భారీ ఎత్తున ధ‌ర‌లు పెంచింది. అయిన‌ప్ప‌టికీ.. మ‌ద్యం ప్రియులు కిక్కురు మ‌న‌కుండా.. జేబులు గుల్ల చేసుకుంటున్నారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇదే ప్ర‌భుత్వం.. స‌గ‌టు ప్రేక్ష‌కుడుకి వినోదం పంచే.. సినిమాల‌పై గుత్తాధిప‌త్యానికి తెర‌దీసింది.

సినిమా టికెట్ల‌ను ఇష్టానుసారం పెంచేస్తున్నార‌ని.. ప్ర‌జ‌ల‌ను దోచుకుంటున్నార‌ని.. ప్ర‌భుత్వం పేర్కొంటోంది. వాస్త‌వానికి సినిమా అనేది న‌వ‌ర‌సాల స‌మ్మేళనం. దీనిలో విజ్ఞానం నుంచి వినోదం వర‌కు.. మేధో మ‌ధ‌నం నుంచి సాంకేతిక అంశాల వ‌రకు.. ప్ర‌జ‌లను రంజింప చేసే అనేక అంశాలు ముడిప‌డి ఉన్నాయి. పైగా.. ఇది రోజూ చూసే వ్య‌స‌న‌మూ కాదు. పైగా.. ఇప్పుడు జాతీయంగా అంత‌ర్జాతీయంగా.. సినిమా రంగంలో పెట్టుబ‌డులు పెరిగిపోయాయి. ప్ర‌భుత్వాల ట్యాక్సులు.. షూటింగ్‌ల కోసం వెచ్చించే సొమ్ము.. విద్యుత్.. ఇత‌ర చార్జీల ధ‌రలు కూడా భారీ ఎత్తున పెరిగాయి.

ఈ నేప‌థ్యానికి తోడు .. న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న్‌.. వంటివి కూడా పెరిగిపోయాయి. దీంతో విధిలేని ప‌రిస్థితిలో అత్యంత త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ షోలు వేసి.. ఈ సొమ్మును తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు నిర్మాత‌లు.. ఎగ్జిబిట‌ర్లు. దీనికి ఒకే ఒక కార‌ణం ఉంది. పైర‌సీ. సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చాక‌.. ఒక్క‌సారి క‌నుక పైర‌సీ అయితే.. ఇక‌, సినిమా హాళ్ల‌కు వ‌చ్చేవారు త‌గ్గిపోతారు. దీంతో తొలి రోజుల్లోనే ఎక్కువ షోలు ప్ర‌ద‌ర్శించి.. పైర‌సీ ముప్పు నుంచి బ‌య‌ట‌ప‌డాల‌నేది కూడా దీనిలో వ్యూహం అయితే.. ఏపీ ప్ర‌భుత్వం మాత్రం క్షేత్ర‌స్థాయిల స‌మస్య‌లు ప‌ట్టించుకోకుండా.. సినిమాలపై గుత్తాధిప్య‌త ప్ర‌ద‌ర్శించ‌డం.. అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది.