శింబు - నిధి అగర్వాల్ 'ఈశ్వరన్' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్..!

Mon Oct 26 2020 17:00:04 GMT+0530 (IST)

Shimbu - Nidhi Agarwal '' Eeswaran '' First Look Motion Poster ..!

కోలీవుడ్ స్టార్ హీరో శింబు 'మన్మథ' 'వల్లభ' 'నవాబ్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. టి. రాజేందర్ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శింబు తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం శింబు మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. వాటిలో నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్రామీణ నేపథ్య చిత్రం ఒకటి. మహాదేవ్ మీడియా బాలాజీ సమర్పణలో డీ కంపెనీ - కేవీ దురై బ్యానర్ లో ఈ చిత్రం నిర్మితమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి ''ఈశ్వరన్'' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు వెల్లడిస్తూ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.'ఈశ్వరన్' ఫస్ట్ లుక్ పోస్టర్ లో శింబు తమిళ్ స్టైల్ లో లుంగీ కట్టుకొని పడగవిప్పిన పాముని మెడ మీద వేసుకొని కనిపిస్తున్నాడు. అంతేకాకుండా మోషన్ పోస్టర్ లో మెడపై క్రికెట్ బ్యాట్ పట్టుకొని 'ఇప్పుడు వేయండిరా బాలు' అని డైలాగ్ చెప్తున్నట్లు చూపించారు. శింబు లుక్ చూస్తుంటే గతంలో కంటే చాలా బరువు తగ్గినట్లు కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో శింబు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ్ లో ఇప్పటికే 'భూమి' అనే సినిమాలో నటించిన నిధికి ఇది రెండో ప్రాజెక్ట్. మోస్ట్ వాంటెడ్ థమన్ సంగీతం సమకూర్చనున్నాడు. ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

కాగా శింబు వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'మానాడు' అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తోంది. దీంతో పాటు కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ 'ముఫ్తీ' ని తమిళ్ లో రీమేక్ చేస్తున్నారు శింబు. స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి నార్తాన్ దర్శకత్వం వహిస్తున్నారు. శింబు చాలా రోజుల తర్వాత వరుస చిత్రాలను అనౌన్స్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.