నెపోటిజం పై సీనియర్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Sun Aug 09 2020 21:27:59 GMT+0530 (IST)

Shilpa Shetty Comments on Nepotism In Bollywood

సినీ ఇండస్ట్రీని గత కొన్ని రోజులుగా 'నెపోటిజం' అనే అంశం కుదిపేస్తోంది. ఇది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నదే అయినప్పటికీ బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో ఒక్కసారిగా బంధుప్రీతిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి ఎక్కువైందని.. దీని కారణంగా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన బయట వారికి అవకాశాలు రాకుండా చేస్తుంటారని.. నటవారసులకి మాత్రం ప్రతిభతో సంబంధం లేకుండా ఛాన్సెస్ ఇస్తుంటారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అనేకమంది నటీనటులు మేము కూడా నెపోటిజం బాధితులమే అంటూ ముందుకొచ్చి తమ అనుభవాలను చెప్తున్నారు. అంతేకాకుండా నెపోటిజం స్టార్స్ సైతం వారి అభిప్రాయలను వెల్లడిస్తున్నారు. కరీనా కపూర్ శృతి హాసన్ విద్యుత్ జమాల్ లాంటి వారు దీనిపై తమ అభిప్రాయాలను చెప్పారు. ఈ నేపథ్యంలో సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి కూడా ఓ ఇంటర్వ్యూలో నెపోటిజంపై స్పందించింది.శిల్పాశెట్టి మాట్లాడుతూ డెస్టినీని నేను నమ్ముతానని.. అదే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని.. విధిరాత కంటే నెపోటిజం అనేది గొప్పదేమీ కాదని పేర్కొంది. అంతేకాకుండా ''నేను ఎటువంటి సినిమా బ్యాగ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి వచ్చాను. కానీ కృషి పట్టుదలతో ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నాను. విధి కారణంగానే మనమందరం ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ నిలదొక్కుకోవాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి. పట్టుదలతో పాటు టాలెంట్ కూడా ఉండాలి. మనం నిర్దేశించుకున్న గమ్యం చేరుకునే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా లక్ష్యం కోసం పోరాడుతూనే ఉండాలి. అప్పుడు మనల్ని సక్సెస్ అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు'' అని శిల్పా శెట్టి చెప్పుకొచ్చారు.