ఎస్వీఆర్ ను అలా చూసి ఆమె చాలా బాధపడిందట!

Tue Jul 20 2021 14:35:48 GMT+0530 (IST)

She was so upset to see SVR like that!

తెలుగులో 'భక్త ప్రహ్లాద' సినిమాలో ప్రహ్లాదుడిగా కనిపించి మురిపించిన రోజారమణి ఆ తరువాత 'కన్నె వయసు' సినిమాలో 'ఏ దివిలో విరిసిన పారిజాతమో' అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేశారు. ఆ తరువాత కూడా ఆమె చాలా సినిమాల్లో కీలకమైన పాత్రల్లో నటించారు. అంతేకాదు తనకి అవకాశాలు తగ్గుతున్న సమయంలో ఆమె డబ్బింగ్ ఆర్టిస్టుగా బిజీ అయ్యారు. అప్పట్లో ఇతర భాషల్లో నుంచి వచ్చిన హీరోయిన్లలో చాలామందికి ఆమె డబ్బింగ్ చెప్పారు. అలాంటి రోజారమణి తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో తన భర్త చక్రపాణితో కలిసి పాల్గొన్నారు."నేను తెలుగు .. తమిళ .. కన్నడ .. మలయాళ భాషల్లో 130 సినిమాల వరకూ చేశాను. పెళ్లి అయిన తరువాత నేను ఇక నటించలేదు. ఆ తరువాత నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యాను. చాలామంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పాను. ఇప్పటికీ నాకు డబ్బింగ్ అంటే చాలా ఇష్టం. ఇక మా వారు చక్రపాణి 'ఒరియా' సినిమాల్లో నెంబర్ వన్  హీరో అనిపించుకున్నారు. తెలుగులో ఎన్టీఆర్ చేసిన సినిమాల ఒరియా రీమేక్ లలో ఆయనే హీరోగా చేశారు. ఇక మా తరువాత తరుణ్ సినిమాల్లోకి వచ్చాడు. ముగ్గురం కూడా తెరపై ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాం.

అందరూ ఎస్వీఆర్ తో ఎలా యాక్ట్ చేశావు అని అడుగుతుంటారు. అప్పడు నాది చాలా చిన్న వయసు కదా అందువలన ఆయన ఎస్వీఆర్ అనే విషయం కూడా నాకు తెలియదు. 'భక్త ప్రహ్లాద'లో హిరణ్యకశిపుడిగా ఆయన కిరీటం .. ఆభరణాలు పెట్టుకుని .. పట్టుపంచెలు కట్టుకుని ఎంతో గొప్పగా కనిపించారు. ఆ తరువాత ఆయనతో కలిసి 'చిన్నారి పాపలు' సినిమాను చేశాను. ఆ సినిమాలో ఆయన చిరిగిపోయిన బట్టలు కట్టుకుని .. బట్టతలతో తోటమాలిగా కనిపిస్తారు. అప్పుడు ఆయనను చూసి "పాపం ఇలా అయిపోయాడేంటి ఈయన" అనుకున్నాను. బాగా ఊహ తెలిసిన తరువాత నాకు అది ఆయన పాత్ర అనే విషయం అర్థమైంది. అప్పటివరకూ ఆ విషయాన్ని గురించే నేను ఆలోచన చేస్తూ బాధపడుతూ ఉండేదానిని.    

ఇక మా ఇంట్లో మా తరువాత సినిమాల వైపుకు వచ్చింది తరుణ్. బాలనటిగా తొలి రోజుల్లో నాకు ఎంతటి పేరు వచ్చిందో తరుణ్ కి కూడా బాలనటుడిగా అంతటి గుర్తింపు రావడం గొప్ప విషయం. సాధారణంగా ఇలా జరగడం చాలా అరుదు. అది మా విషయంలో జరగడం మాకు చాలా ఆనందాన్ని కలిగించే విషయం. బయటనే కాదు .. ఇంట్లో కూడా తరుణ్ చాలా సరదాగా ఉంటాడు. పెద్దవాళ్లను తరుణ్ చాలా గౌరవిస్తాడు.  సాధ్యమైనంతవరకూ ఎప్పుడూ ఎవరూ నొచ్చుకునేలా మాట్లాడడు. ఒకవేళ పొరపాటుగా ఏమైనా మాట్లాడితే వెంటనే సారీ చెప్పేస్తాడు. మా జీవితంలో మాకు బాగా ఆనందాన్ని కలిగించిన క్షణాలు ఏవైనా ఉన్నాయంటే అవి నటుడిగా తరుణ్ అవార్డులను గెలుచుకున్నప్పటివే" అంటూ చెప్పుకొచ్చారు.