శంకర్ మరో ప్రయోగం .. ఏ స్టార్ హీరోతోనో తెలుసా?

Fri Sep 23 2022 05:00:01 GMT+0530 (India Standard Time)

 Shankar is another experiment movie

ఇప్పుడంటే పాన్ ఇండియా అనే మాట వినిపిస్తోందిగానీ ఒకప్పుడు ఆ స్థాయిలోనే శంకర్  సినిమాలు దేశమంతా చుట్టబెట్టాయి. శంకర్ కి కథాకథనాల పైనే కాదు .. సాంకేతిక పరిజ్ఞానంపై కూడా పట్టు ఎక్కువ. ఆయన నుంచి వచ్చిన 'రోబో' సినిమా చూసినవాళ్లంతా ఒక రేంజ్ లో ఆశ్చర్యపోయారు. ఇక పాటల విషయంలోను ఆయన ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకుంటారని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.  ఆయన నుంచి ఇంతవరకూ వచ్చిన సినిమాలే అందుకు  కొలమానంగా నిలుస్తాయి. అలాంటి శంకర్ ఇప్పుడు రెండు ప్రాజెక్టులతో  బిజీగా ఉన్నాడు.చరణ్ హీరోగా శంకర్ ఒక భారీ ప్రాజెక్టును రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 75 శాతం చిత్రీకరణను జరుపుకుంది. కియారా కథానాయికగా అలరించనున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇక ఇదే సమయంలో ఆయన గతంలో ఆగిపోయిన 'ఇండియన్ 2' సినిమాను పూర్తి చేస్తున్నాడు. కమల్ కథానాయకుడిగా ఈ సినిమా నిర్మితమవుతోంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాతలుగా ఉన్న ఈ సినిమాకి భారీ తారాగణమే ప్రధానమైన ఆకర్షణగా నిలవనుంది.

ఈ రెండు సినిమాలను కూడా వీలైనంత స్పీడ్ గా పూర్తి చేయాలనే ఉద్దేశంతో శంకర్ ఉన్నారు. ఆ తరువాత ఆయన ఏ హీరోతో చేయనున్నాడనే ఆసక్తి  అప్పుడే మొదలైపోయింది. ఈ నేపథ్యంలోనే హీరో సూర్య పేరు వినిపిస్తోంది. కోలీవుడ్ హీరోల్లో కొత్తదనానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే హీరోగా సూర్య కనిపిస్తాడు. ఆయనకి శంకర్ ఒక కథను వినిపించడం .. సూర్య ఆ కథను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ సినిమా సూర్య  సొంత బ్యానర్లో నిర్మితం కానుందనేది మరో విశేషం.

తమిళంలో వెంకటేశన్ రాసిన 'వెల్పరి' అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. వెంకటేశన్  ఆరేళ్ల పాటు పరోశోధన చేసి ఈ నవలను రాశాడట. అప్పట్లో ఈ కథ తమిళంలో 'ఆనంద్ వికటన్'  అనే వీక్లీలో 100  వారాల పాటు సీరియల్ గా పాఠకులను అలరించింది. అంతగా పాప్యులర్ అయిన ఆ నవల హక్కులను సూర్య సొంతం చేసుకున్నాడని అంటున్నారు. చాలా కాలం క్రితం నవలలను పక్కన పెట్టేసి .. పైపైన కథలను అల్లుకుంటూ వచ్చిన స్టార్ డైరెక్టర్లు మళ్లీ ఆ దిశగా అడుగులు వేయడం ఆహ్వానించదగిన పరిణామమే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.