నాగార్జున నన్ను చూసి షాక్ అయ్యారు: సీనియర్ నటి సుధ

Mon Jan 24 2022 22:00:02 GMT+0530 (IST)

Senior Actress Sudha About Nagarjuna

తెలుగు తెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుధ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అక్క .. వదిన .. అమ్మ పాత్రలను ఆమె ఎక్కువగా పోషించారు. కెరియర్ తొలినాళ్లలో తెరపై ఆమెను చూసినవాళ్లు హీరోయిన్ గా ట్రై చేసుకోవచ్చును గదా అనుకున్నారు. ఇక కొంతమంది హీరోయిన్లు గ్లామర్ పరంగా తాము ఎక్కడ తేలిపోతామోనని ఆమెతో కలిసి తెరపై కనిపించడానికి కంగారు పడ్డారు. అలా ఆమె మూడు దశాబ్దాలకి పైగా అనేక సినిమాలలో చేస్తూ వచ్చారు. తాజా ఇంటర్వ్యూలో సుధ మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు.నాగార్జున - మీనా కాంబినేషన్లో 'ప్రెసిడెంట్ గారి పెళ్ళాం' సినిమా షూటింగు జరుగుతోంది. దొరస్వామి రాజు నిర్మాత .. దర్శకుడు కోదండరామిరెడ్డిగారు. అప్పటికే సుధ అంటే అందరికీ తెలుసు. నాకు కాల్ చేసి ఆ సినిమాను గురించి .. నేను చేయవలసిన పాత్రను గురించి చెప్పారు. నేను ఓకే అనేసి ముందురోజే హైదరాబాద్ వచ్చేశాను. అప్పుడు నాగార్జున - మీనాపై 'భాస్కర ప్యాలెస్'లో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. డైరెక్టర్ గారిని కలవాలనే ఉద్దేశంతో నేను వైట్ చుడిదార్ వేసుకుని అక్కడికి వెళ్లాను.

ఫస్టు టైమ్ నాగార్జునగారితో వర్క్ చేయబోతున్నాను కనుక ఆయనతో కూడా మాట్లాడాలనే ఉద్దేశంతో ఉన్నాను. నాగార్జున గారు నన్ను ఓ సారి పైకి .. కిందికి చూశారు. ఆ తరువాత 'ఈవిడ వదిన క్యారెక్టరా .. కరెక్టుగానే పెట్టారా?' అని డైరెక్టర్ గారితో అన్నారట. ఆ విషయం ఆ తరువాత నాకు తెలిసింది. అక్కడ అందరినీ పలకరించేసి రూమ్ కి వచ్చేసిన తరువాత మరుసటి రోజు షూటింగుకి వెళ్లాను. నా పాత్రకి తగినట్టుగా కాటన్ శారీ కట్టుకుని .. కొప్పు పెట్టుకుని వెళ్లాను. అప్పుడు కూడా నాగార్జునగారు నన్ను చూసి షాక్ అయ్యారు. 'నిన్న వచ్చింది నువ్వే కదా' అంటూ ఆశ్చర్యపోయారు.

మొన్నామధ్య 'గ్రీకు వీరుడు' సినిమా షూటింగు సమయంలోను ఇదే మాట అన్నారాయన. ''నువ్వు కెమెరా ముందు ఒక రకంగా ఉంటావు .. కెమెరా వెనుక ఒక రకంగా ఉంటావు'' అన్నారు. హీరోయిన్ గా చేయవలసిన నేను ఇలా క్యారెక్టర్ రోల్స్ చేయడం ఏంటని నేను ఎప్పుడూ అనుకోలేదు. బాలచందర్ గారు ఇచ్చిన సలహా ప్రకారం నేను ఈ రూట్లోకి రావడం వల్లనే ఇండస్ట్రీలో ఇంతకాలం పాటు ఉండగలిగాను. ప్రాధాన్యత లేని పాత్రలను చేయడం ఇష్టం లేక ఈ మధ్య కొన్ని వదులుకుంటున్నాను. 'మేము రావడం వలన సుధ గారికి అవకాశాలు తగ్గాయని కొంతమంది చెప్పుకున్నారు. కానీ సుధ చేయనంది కనుకనే ఆ వేషాలు వాళ్లకి వెళ్లాయి" అని చెప్పుకొచ్చారు.