Begin typing your search above and press return to search.

నేను డబ్బువెంట పడలేదు .. అదే వెతుక్కుంటూ వచ్చింది!

By:  Tupaki Desk   |   14 Jan 2022 11:30 AM GMT
నేను డబ్బువెంట పడలేదు .. అదే వెతుక్కుంటూ వచ్చింది!
X
తెలుగులో గ్లామరస్ హీరోయిన్ గా .. ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా జయచిత్ర ప్రేక్షకుల హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగుతో పాటు తమిళ .. కన్నడ భాషల్లో కలుపుకుని ఆమె దాదాపు 200 సినిమాలకి పైగా చేశారు. అప్పట్లో వాయిస్ లో ఒక ప్రత్యేకత ఉన్న కథానాయికలలో ఆమె ఒకరు. ఆమె డైలాగ్ డెలివరీని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అలాంటి జయచిత్ర తాజా ఇంటర్వ్యూలో తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లను నేను చాలా దగ్గరగా చూశాను. ఎన్టీఆర్ కి నటనతో పాటు రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి ఉండేది. కానీ ఏఎన్నార్ కి రాజకీయాలపై ఆసక్తి ఉండేది కాదు. అయితే ఇద్దరూ కూడా సినిమాలను గురించి .. సినిమాలకి సంబంధించిన విషయాలను గురించే ఆలోచిస్తూ ఉండేవారు. తమ సినిమాల షూటింగు సమయంలో మిగతా ఆర్టిస్టులతో చాలా బాగా ఉండేవారు. ముఖ్యంగా ఏఎన్నార్ గారు సెట్లో చాలా సాదాసీదాగా ఉండేవారు. ఆయన మాటల్లో కామెడీ ఎక్కువగా ఉండేది. తాను పెద్ద స్టార్ హీరో అన్నట్టుగా ఆయన ఉండేవారే కాదు.

నేను ఎక్కువగా నా పాత్రకి సంబంధించిన విషయాలపైనే దృష్టి పెట్టేదానిని. నా పాత్ర ఏమిటి? ఎలాంటి డైలాగ్స్ ఉన్నాయి? ఎలా చెప్పాలి? ఎలాంటి షాట్స్ పెడుతున్నారు? ఇలా సెట్లో నేను నా పాత్రను గురించే ఆలోచన చేసేదానిని. అప్పట్లో కొంతమంది హీరోయిన్ల డేట్స్ కోసం హీరోలు వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. అలాంటి హీరోయిన్స్ లో నేను కూడా ఉన్నాను. నేను తెల్లవారు జామున 2 గంటలకి నిద్రపోయి 4 గంటలకు లేచి షూటింగుకి వెళ్లిన రోజులు ఉన్నాయి. ఫ్లైట్ లో నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయి.

ఒకానొక ఏడాదిలో నేను 23 సినిమాలు చేశాను. రోజుకి 5 షిఫ్టులు పనిచేశాను. దేవుడు ఇచ్చిన అవకాశం అనుకుని చాలా హార్డు వర్క్ చేశాను. అప్పట్లో లక్ష రూపాయల పారితోషికం అంటే ఇప్పటితో పోల్చుకుంటే పాతిక లక్షలు అని చెప్పవచ్చు. నేను లక్ష నుంచి 3 లక్షల వరకూ తీసుకునేదానిని. ప్రాపర్టీస్ కోనేసేంత డబ్బు అది. నేను చాలా వరకూ అలా కొన్నవే. అయితే ఎప్పుడూ కూడా నేను డబ్బు కోసం వర్క్ చేయలేదు .. డబ్బు వెంట పడలేదు .. డబ్బు నన్ను వెతుక్కుంటూ వచ్చింది. 'వయసు పిలించింది' సినిమా కోసం రజనీ .. కమల్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నది నేనే" అని చెప్పుకొచ్చారు.