ప్రభాస్ లాంచ్ చేసిన సోల్ ఫుల్ 'సత్యం శివం' సాంగ్..!

Wed May 18 2022 21:24:27 GMT+0530 (IST)

Satyam Shivam Sundharam Lyrical From Shekar

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇతర హీరోల సినిమాలు మరియు చిన్న చిత్రాలకు తనవంతు సపోర్ట్ ఇస్తుంటారనే సంగతి తెలిసిందే. భారీ ఫాలోయింగ్ ఉన్న డార్లింగ్ తో తమ సినిమాలకు సంబంధించిన కంటెంట్ ని రిలీజ్ చేయిస్తే కావాల్సినంత బజ్ క్రియేట్ అవుతుందని ఫిలిం మేకర్స్ భావిస్తుంటారు. ఇప్పుడు ''శేఖర్'' చిత్రానికి ప్రభాస్ మద్దతుగా నిలిచారు.సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ ''శేఖర్''. 'మ్యాన్ విత్ ది స్కార్' (మచ్చల మనిషి) అనేది దీనికి ఉపశీర్షిక. ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 20న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా 'శేఖర్' సినిమాలోని 'సత్యం శివం' అనే పాటను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి విషెస్ అందజేశారు. 'సత్యం శివం సుందరం.. జగమే దివ్య మందిరం.. ఎటుగా చూసినా నీ వెలుగేనయా..' అంటూ సాగిన ఈ సోల్ ఫుల్ సాంగ్ ఆకట్టుకుంటోంది.

ఇందులో రాజశేఖర్ వయసు మీద పడిన లుక్ లో కనిపిస్తుండగా.. ఆయన కుమార్తె శివాని కూడా ఈ పాటలో భాగం పంచుకుంది. 'సత్యం శివమ్' పాటకు అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చగా.. విజయ్ ఏసుదాస్ - ఉమా నేహా కలిసి అద్భుతంగా ఆలపించారు. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి అర్థవంతమైన సాహిత్యం అందించారు.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ 'శేఖర్' సినిమాపై ఆసక్తిని కలిగించాయి. అలానే 'లవ్ గంటే మోగిందంట' 'కిన్నెర' 'చిన్ని చిన్ని ప్రాణం' పాటలు శ్రోతలను ఆకట్టుకోగా.. లేటెస్టుగా వచ్చిన 'సత్యం శివం' సాంగ్ అనూహ్య రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ''శేఖర్''.. మలయాళ సూపర్ హిట్ ‘జోసెఫ్’ మూవీకి తెలుగు రీమేక్. ఇందులో ఆత్మీయ రాజన్ - ముస్కాన్ - అభినవ్ గోమటం - కన్నడ కిషోర్ - సమీర్ - భరణి - రవివర్మ - శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.

వంకాయలపాటి మురళీ కృష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్పొరేషన్ - సుధాకర్ ఇంపెక్స్ ఐపియల్ - త్రిపురా క్రియేషన్స్ - టారాస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. బీరం సుధాకర్ రెడ్డి - శివాని రాజశేఖర్ - శివాత్మిక రాజశేఖర్ - బొగ్గారం వెంకట శ్రీనివాస్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

లక్ష్మీ భూపాల ఈ సినిమాకి మాటలు రాయగా.. మల్లిఖార్జున నారగాని సినిమాటోగ్రఫీ అందించారు. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ - శివాని కలిసి నటించిన ''శేఖర్'' సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.