Begin typing your search above and press return to search.

రొమాంటిక్ హీరోగా సత్యదేవ్ ను ఒప్పుకుంటారా?

By:  Tupaki Desk   |   3 July 2022 6:00 AM GMT
రొమాంటిక్ హీరోగా సత్యదేవ్ ను ఒప్పుకుంటారా?
X
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా టాలీవుడ్ కి వచ్చి .. హీరో అనిపించుకున్నవారిలో సత్యదేవ్ ఒకరు. 'మిస్టర్ పెర్ఫెక్ట్' సినిమాతో పరిచయమైన సత్యదేవ్, ఆ తరువాత చిన్న చిన్న పాత్రలను చేస్తూ 'జ్యోతిలక్ష్మి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు తెరకి ఓ విలక్షణ నటుడు దొరికాడు అనుకునేలా చేయగలిగాడు. ఆ తరువాత 'బ్లఫ్ మాస్టర్' .. ' రాగాల 24 గంటల్లో' ... 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి విభిన్నమైన కథాచిత్రాలు చేసుకుంటూ వెళ్లాడు. అయితే ఆ సినిమాలేవీ ఆయన కెరియర్ కి పెద్దగా హెల్ప్ కాలేకపోయాయి.

ఇక ఇటీవల ఆయన నుంచి 'గాడ్సే' అనే సినిమా వచ్చిందికానీ .. దానిని ఎవరూ పట్టించుకోలేదు. సత్యదేవ్ మంచి ఆర్టిస్ట్ అందులో ఎలాంటి సందేహం లేదు. వరుస ఫ్లాపులు పడుతున్నా ఇంకా ఆయనకి అవకాశాలు వస్తుండటానికి కారణం అదే. అయితే ఆయన తన బాడీ లాంగ్వేజ్ కి భిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ ఉండటం, అలా ఎంచుకున్న కథల్లోను కొత్తదనం లేకపోవడమే ఈ పరాజయాలకు కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సమాజంలో అవినీతి .. అన్యాయాలను తెరపై ఆవేశంతో చూపించడం వలన సక్సెస్ అయిన సినిమాలు చాలా తక్కువ. అలాంటి జాబితాలోకే 'గాడ్సే' వస్తుంది.

కథాంశం ఏదైనా దాని చుట్టూ వినోదం అనేది లేకపోతే .. ప్రేక్షకుడు ఒప్పుకోడు. నిత్యం పేపర్లో .. టీవీల్లో చూసే విషయాలను థియేటర్ కి వచ్చి తెలుసుకోవాలనుకోరు. అందువలన సినిమా ప్రధానమైన ఉద్దేశం వినోదాన్ని అందించడమే .. దానికి మిగతా అంశాలను కలిపి షుగర్ కోటింగ్ ఇస్తే ఓకే. కానీ ఆశయాలను .. సిద్ధాంతాలను ఆవేశంతో చెప్పడానికి ట్రై చేస్తే 'గాడ్సే' లాంటి ఫలితాన్నే అందుకోవలసి వస్తుంది. ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఇప్పుడు సత్యదేవ్ 'గుర్తుందా శీతాకాలం' సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాడు.

నాగశేఖర్ దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో సత్యదేవ్ - తమన్నా నాయకా నాయికలుగా నటించారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టైటిల్ ను బట్టే ఈ కథలో ప్రేమ .. విరహం అనే అంశాలు ప్రధానంగా ఉన్నాయనే విషయం అర్థమవుతోంది. తమన్నా అందగత్తెనే కావొచ్చు కానీ ఆమెను ప్రేమకథల్లో చూడాలని ప్రేక్షకులు అనుకోవడం లేదు. రొమాంటిక్ టచ్ తో ఉన్న పాత్రలకి సత్యదేవ్ సెట్ కాడు. ముఖ్యంగా ముదురు ప్రేమకథలను చూడటానికి ఈ కాలం ప్రేక్షకులు ఇష్టపడటం లేదనడానికి కొన్ని ఉదాహరణలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా .. ఇక సత్యదేవ్ తన బాడీ లాంగ్వేజ్ కి తగిన విభిన్నమైన పాత్రలను ఎంచుకోవలసిన సమయం వచ్చేసిందనేది మాత్రం వాస్తవం.