Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : సత్తి గాని రెండెకరాలు (OTT)

By:  Tupaki Desk   |   27 May 2023 10:26 AM GMT
మూవీ రివ్యూ : సత్తి గాని రెండెకరాలు (OTT)
X
సత్తి గాని రెండెకరాలు (OTT)

నటీనటులు: జగదీష్ ప్రతాప్, వెన్నెల కిశోర్, రాజ్ తరిందాసు, మోహన శ్రీ, అనీషా దామా, బిత్తిరి సత్తి, వంశీధర్ గౌడ్ తదితరులు

సంగీతం: జై క్రిష్

ఛాయాగ్రహణం: విశ్వనాథ్ రెడ్డి

నిర్మాతలు : వై.రవిశంకర్, నవీన్ యెర్నేని

కథ - స్క్రీన్ ప్లే - ఎడిటింగ్ - దర్శకత్వం : అభినవ్ దండ

పుష్ప సినిమాలో కేశవ పాత్రలో అలరించిన జగదీష్ ప్రతాప్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా సత్తిగాని రెండెకరాలు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఆహా లో స్ట్రీమింగ్ అయిన సత్తిగాని రెండెకరాలు ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :కొల్లూరు గ్రామంలో ట్రాలీ ఆటో నడిపిస్తూ జీవితం సాగిస్తుంటాడు సత్తి (జగదీష్ ప్రతాప్ బండారి). భార్యా ఇద్దరు పిల్లలని పోషించడానికి తనకు ఉన్న రెండు ఎకరాలు చూసుకుంటూ ఉన్న అతని పాపకి హార్ట్ ఆపరేషన్ కి 30 లక్షల దాకా డబ్బు అవసరం వస్తుంది. అంత డబ్బు పెట్టి ఆపరేషన్ చేయించాలంటే తనకున్న రెండెకరాలు అమ్మాలి తప్ప వేరే మార్గం లేదు. తన దగ్గర ఉన్న రెండెకరాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమ్మొద్దని సత్తికి చిన్నప్పుడే తాత చెబుతాడు. తనని అవసరానికి ఆదుకున్నట్టుగానే తన సర్పంచ్ మామ సత్తి పొలాన్ని అమ్మి లాభపడాలని చూస్తాడు. ఆ టైం లోనే సత్తి చూస్తుండగానే ఒక కారు యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ కారులో సూట్ కేస్ కంటపడుతుంది. అది తీసుకుని అక్కడ నుంచి జంప్ అవుతాడు సత్తి. ఆ సూట్ కేసులో ఏముందో తెలుసుకోవాలని తన స్నేహితుడు అంజి (రాజ్ తిరందాసు) సహాయం తీసుకుంటాడు. ఈలోగా ఆ సూట్ కేస్ కోసం వెన్నెల కిశోర్ వస్తాడు. ఎవరో అతన్ని ఆపరేట్ చేస్తూ ఆ సూట్ కేసు కంపల్సరీ కావాలని అంటారు. ఊరిలో కారు యాక్సిడెంట్ విషయం తెలిసి ఎస్సై (బిత్తితి సత్తి) ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇంతకీ ఆ సూట్ కేస్ లో ఏముంది..? సత్తి కష్టాల నుంచి ఎలా బయటపడ్డాడు..? సత్తి రెండెకరాలు అమ్మాడా లేదా అన్నది సినిమా కథ.

కథనం-విశ్లేషణ :

డిజిటల్ ఫ్లాట్ ఫాం వచ్చాక ఎలాంటి కథ అయినా ఆడియన్స్ కు చెప్పొచ్చు అనే నమ్మకం వచ్చింది. అయితే కొన్ని కథలు ప్రేక్షకులను మెప్పించగా మరికొన్ని మాత్రం విఫలమవుతున్నాయి. లేటెస్ట్ గా ఆహాలో తెలుగు ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చిన సత్తిగాని రెండెకరాలు చాప్టర్ 1 ఆశించిన స్థాయిలో అలరించలేదు.

ఆపదలో ఉన్న హీరో దాని నుంచి బయటపడేలా ఒక దురాలోచన రావడం దాని వల్ల లబ్ధి పొందుదామని అనుకున్న అతను అనుకోని రిస్క్ లో పడటం ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చాయి. అయితే సత్తిగాని రెండెకరాలు అలా కూతురు హార్ట్ ఆపరేషన్ అంటూ కథ మొదలై ఏకంగా డైమండ్ రాళ్ల దగ్గరకు వెళ్తుంది. రెండు గంటల సినిమాలో మొదటి సగం ఆ సూట్ కేసులో ఏముంది అన్న సస్పెన్స్ తో నడిపించిన డైరెక్టర్. మలి సగం దాన్ని ఎలా మార్కెట్ చేయాలనేది చూపించాడు.

టేకింగ్ పరంగా దర్శకుడికి ఓకే అనేలా మార్కులు వేసినా స్లో నరేషన్ సత్తి గాని రెండెకరాలకు పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. సత్తి చుట్టే కథ తిరుగుతున్నా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో మాత్రం విఫలమయ్యారు. మధ్యలో వెన్నెల కిశోర్ పాత్ర ఏదో ఫన్ జనరేట్ చేద్దామని ప్రయత్నించారు అక్కడక్కడ వర్క్ అవుట్ అయినట్టు అనిపించినా.. యాక్సిడెంట్ కారుని పెట్రోల్ పోసి తగలబెడితే పోలీసులు ఏమాత్రం దాన్ని సీరియస్ గా తీసుకోకుండా అలా అతన్ని వదిలేయడం చాలా సిల్లీగా అనిపిస్తుంది.

లీడ్ పెయిర్ మధ్య సీన్స్.. మనిషికి కష్టం వస్తే అతని అవసరాన్ని ఎదుటి వారు అవకాశంగా తీసుకుంటారన్న సన్నివేశాలు. అంజి సర్పంచ్ కూతురితో వచ్చే సీన్స్ ఇవన్ని ఈ సినిమాలో చెప్పుకోదగిన సీన్స్. దర్శకుడు అభినవ్ తన రైటింగ్ స్కిల్స్ ని సినిమా ఓపెనింగ్ డైలాగ్స్ తోనే చూపించగా సినిమా మొత్తం అదే రేంజ్ లో ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సినిమా చాలా చోట్ల స్లో గా వెళ్తుందని అనిపిస్తుంది. ఇక కొన్నిచోట్ల ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి. సినిమా మొత్తం కామెడీ ఎంటర్టైనర్ గానే కొనసాగించారు. సినిమా ఇంకాస్త వేగంగా ఉంటే బాగుండేది. సినిమా అంతా ఒకటే కాన్సెప్ట్ తో నడిపించారు. అంతా ఆ ఊరు సత్తి తిప్పలు.. వెన్నెల కిశోర్ సూట్ కేస్ వేట.. రియాజ్ తన దగ్గరకు ఆ డైమండ్ రాళ్లను తీసుకొచ్చే వారికి డబ్బులు ఇవ్వడం ఇదంతా ఎంగేజింగ్ గా అనిపించదు.

సత్తి గాని రెండెకరాలు చాప్టర్ 1 ని ముగించిన తీరు కూడా అంతగా ఆకట్టుకోలేదు. సత్తి దగ్గర ఉన్న డైమండ్ రాళ్లను కొడుకు రంగు డబ్బాలో వేసి సగం తన ఫ్రెండ్స్ కి ఇస్తాడు. అయితే మిగిలిన సగం తను తయారు చేసుకున్న చేపల అక్వేరియం లో వేస్తాడు. బహుశా ఈ సీన్ కోసమే అనుకుంటా ఒకసారి సత్తి కొడుకు చెరువులో చేపలు పడతాడు. ఇంత డీటైలింగ్ ఉన్న దర్శకుడు కథని వేగంగా నడిపించాలి అనే ఫార్ములా మిస్ అయ్యాడు.

నటీనటులు:

సత్తి పాత్రలో జగదీష్ ప్రతాప్ అదరగొట్టేశాడు. మధ్య తరగతి తండ్రి ఆయన బాధ్యతలు పిల్లల కోసం అతను పడే తపన తన పాత్ర ద్వారా మెప్పించాడు జగదీష్. ఆల్రెడీ పుష్పలోనే తన పాత్రతో సర్ ప్రైజ్ చేసిన జగదీష్ సత్తి పాత్రలో తన ప్రతిభ చాటాడు. ఇక సత్తి తర్వాత అంజి పాత్రలో నటించిన రాజ్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. ఈమధ్య కాలంలో వరుస అవకాశాలు అందుకుంటున్న మురళీధర్ గౌడ్ కూడా సర్పంచ్ పాత్రలో అలరించాడు. వెన్నెల కిశోర్ ఈ సినిమాలో తన పంచుల కన్నా యాక్టింగ్ కి ఎక్కువ ప్రాముఖ్యత లభించింది. తన పంచులతోనే కాదు ఇలా కూడా తను మెప్పించగలనని ప్రూవ్ చేసుకున్నాడు. అయితే వెన్నెల కిశోర్ ని ఇంకా సరిగా వాడుకోలేదని మాత్రం అర్థమవుతుంది. బిత్తిరి సత్తి ఒక వెరైటీ ఎస్సై పాత్రలో కనిపించాడు. సత్తి భార్యగా మోహన శ్రీ సహజ నటన ఆకట్టుకుంది. అంజి లవర్ గా అనీషా దామా ఓకే అనిపించుకుంది. సినిమాలో సత్తి కొడుకుగా చేసిన బుడ్డోడు కూడా డైలాగ్స్ అదరగొట్టాడు.

సాంకేతిక వర్గం:

సత్తి గాని రెండెకరాలు సినిమాకు జై క్రిష్ మ్యూజిక్ అందించారు. మ్యూజిక్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత అవసరమో అంత బడ్జెట్ ఇచ్చినట్టు ఉన్నారు. స్టార్ హీరోలతో ఒక పక్క వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఇలాంటి ఒక అటెంప్ట్ మెచ్చుకోదగిన అంశమే. అయితే వారి రేంజ్ కి తగిన ప్రొడక్షన్ వాల్యూస్ కొద్దిగా లోపించాయని అనిపిస్తుంది. ఇక డైరెక్టర్ అభినవ్ ఈ సినిమాతో తన టాలెంట్ చూపించాలని ప్రయత్నించినా అక్కడక్కడ ట్రాక్ తప్పడం వల్ల ఇది అనుకున్న విధంగా అవుట్ పుట్ తీసుకురాలేకపోయాడని చెప్పొచ్చు.

చివరగా : సత్తి గాని రెండెకరాలు.. బాగా సాగదీశారు..!