'సర్కారు వారి పాట' ఫస్ట్ లుక్: వింటేజ్ మహేష్ ఈజ్ బ్యాక్..!

Sat Jul 31 2021 17:01:41 GMT+0530 (IST)

Sarkaru Vaari Paata First look

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట' పై ఎంతటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్లతో జోష్ లో ఉన్న మహేష్.. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతాడని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రీ లుక్ - మోషన్ పోస్టర్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో మహేష్ ఫస్ట్ లుక్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు కావడంతో పది రోజుల ముందుగానే అభిమానులకు ట్రీట్ అందించారు చిత్ర యూనిట్. ముందుగా ప్రకటించినట్లుగానే 'సర్కారు వారి పాట' ఫస్ట్ నోటీస్ పేరుతో ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.మహేష్ బాబు స్టైల్ గా ఓ కార్ డోర్ ఓపెన్ చేసుకొని దిగుతునట్లుగా 'సర్కారు వారి పాట' ఫస్ట్ లుక్ డిజైన్ చేయబడింది. ఇందులో లాంగ్ హెయిర్ - చెవికి రింగు.. రఫ్ గా కనిపించే లైట్ గడ్డం.. మెడ మీద రూపాయి కాయిన్ టాటూతో మహేష్ మాసీ లుక్ లో కనిపిస్తున్నాడు. 'పోకిరి' 'సైనికుడు' సినిమాల లుక్ ని గుర్తు చేస్తూ వింటేజ్ మహేష్ ఈజ్ బ్యాక్ అనేలా ఉన్నాడు. ఫస్ట్ లుక్ తో పాటుగా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

అంతేకాదు మహేష్ పుట్టినరోజు కానుకగా ఆగస్ట్ 9న సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ రాబోతోందని ప్రకటించారు. 'సర్కారు వారి పాట' ఫస్ట్ లుక్ సందర్భంగా మహేష్ ట్వీట్ చేస్తూ ''యాక్షన్ అండ్ ఎంటర్టైనర్ యొక్క ఈ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించండి! ఈ సంక్రాంతికి మాతో చేరండి!'' అని పేర్కొన్నారు. సందేశాత్మక అంశాలతో కూడిన ఎంటర్టైనర్ గా దర్శకుడు పరశురామ్ పెట్లా 'సర్కారు వారి పాట' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్ - సుబ్బరాజు - రావు రమేష్ - వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

'సర్కారు వారి పాట' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్‌టైన్‌మెంట్ - 14 రీల్స్ ప్లస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. మహేష్ బాబు - నవీన్ యెర్నేని - వై.రవిశంకర్ - రామ్ ఆచంట - గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్.మధి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఫైట్ మాస్టర్స్ ద్వయం రామ్ - లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.